Gadari Kishore Police Inquiry: ముగిసిన విచారణ.. గాదరి కిషోర్ ఏమన్నారంటే
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:50 PM
తమ నాయకుడు కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మాట్లాడానని... తనపై కుట్ర పూరీతంగా కేసు నమోదు చేశారని.. తాను అనని వాఖ్యలను చిత్రీకరించారని గాదరి కిశోర్ అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ (Former MLA Gadari Kishore) విచారణ ముగిసింది. ఎంపీ సీఎం సీఎం రమేష్‌పై (MP CM Ramesh) అనుచిత వాఖ్యలు చేసిన కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈరోజు (శనివారం) పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు గాదరిని విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీసులు. విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ... తమ నాయకుడు కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మాట్లాడినట్లు తెలిపారు. తనపై కుట్ర పూరీతంగా కేసు నమోదు చేశారని.. తాను అనని వాఖ్యలను చిత్రీకరించారని అన్నారు.
‘సీఎం రమేష్ టీడీపీ ఎంపీనా, బీజేపీ ఎంపీనా అర్ధం కావడం లేదంటూ.. వారి ఎంపీనే మాట్లాడుతున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడం. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం. సీఎం రమేష్ నీకు రాజకీయాలు ఎందుకు.. నీ దందా నీవు చేసుకో.. కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు చేశారు. చట్టాలను గౌరవించి ఈరోజు విచారణకు హాజరయ్యాను. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను’ అంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేర్కొన్నారు.
కాగా.. గాదరి కిషోర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలో కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గాదరి కిషోర్‌పై ఎంపీ ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ కిషోర్ మాట్లాడారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై 351(1), 353(1)(C), 353(2) r/w 49 బీఎన్‌ఎస్ ప్రకారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు.
ఇవి కూడా చదవండి
సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News