KTR: రామంతపూర్ గోకులే నగర్ ఘటనపై కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:34 AM
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: ఉప్పల్ రామంతపూర్ గోకులే నగర్లో జరిగిన దుర్ఘటన గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా జరిగిన ఊరేగింపులో విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఈ విషాదంలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలు మరణించడం హృదయ విదారకం ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
రామంతాపూర్ గోకులే నగర్లో వైభవంగా సాగుతోన్న శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుత్ షాక్‌తో ఐదుగురు భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. గాయపడిన నలుగురికి మెరుగైన చికిత్స అందించాలని కవిత సూచించారు.
రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేశారు. అనంతరం యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథం లాగుతున్న తొమ్మిది మందిలో ఐదుగురు అక్కడిక్కకడే మృతిచెందగా.. నాలుగు తీవ్రగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..
చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..