Share News

TFI workers wages issue: నిర్మాతలతో చర్చలు విఫలం.. భారీ నిరసనకు సిద్ధమైన సినీ కార్మికులు..

ABN , Publish Date - Aug 09 , 2025 | 08:52 PM

సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15 శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత మరో 5 శాతం పెంచుతామని పేర్కొన్నారు.

TFI workers wages issue: నిర్మాతలతో చర్చలు విఫలం.. భారీ నిరసనకు సిద్ధమైన సినీ కార్మికులు..
Film Industry Workers Wages

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ కార్మికుల వేతనాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భీష్మించుకుని కూర్చోగా.. నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఇవాళ(శనివారం) ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినా.. వ్యవహారం మాత్రం కొలిక్కి రాలేదు. చర్చల అనంతనం కార్మికుల వేతనాలను విడతల వారీగా పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే, ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఒప్పుకోబోదంటూ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ తేల్చి చెప్పారు.


వేతనాల పెంపు.. నిర్మాతల వర్షన్..

సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15 శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత మరో 5 శాతం పెంచుతామని పేర్కొన్నారు నిర్మాతలు. రోజుకి రూ.2వేలలోపు వేతనం తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15 శాతం.. రెండు, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంచుతామని తెలిపారు. రోజుకి రూ.1000 లోపు వేతనం తీసుకునే కార్మికులకు మాత్రం తొలి ఏడాది 20 శాతం, రెండో ఏడాది జీరో శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపుదల ఉంటుందని చెప్పారు. అది కూడా తాము విధించే నాలుగు షరతులకు అంగీకరిస్తేనే ఈ వేతనాల పెంపు ఉంటుందని తేల్చి చెప్పారు.


అందరికీ పెంచాల్సిందే..

అయితే, నిర్మాతలతో తాము జరిపిన చర్చలు విఫలమైనట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు తెలిపారు. అలాగే నిర్మాతల షరతులను తాము అంగీకరించేది లేదని ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ తేల్చి చెప్పారు. ఫెడరేషన్‌ను విభజించేలా వేతనాల పెంపు నిర్ణయం ఉందని మండిపడ్డారు. 13 సంఘాలకూ రోజువారీ వేతనాలు పెంచాల్సిందే తేల్చి చెప్పారు అనిల్. వేతనాల పెంపు నిర్ణయం 10 సంఘాలకే అన్నట్లు నిర్మాతల వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. డ్యాన్సర్లు, ఫైటర్స్, టెక్నీషియన్ సంఘాలకూ వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్‌ డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు. రేపు(ఆదివారం) అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ దగ్గర నిరసన తెలుపుతామని, ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ పిలిస్తే మరోసారి చర్చల్లో పాల్గొంటామని, కానీ వేతనాల విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTPC: తెలంగాణలో ఎన్టీపీసీ రూ. 80 వేల కోట్ల ఫ్లోటింగ్ సోలార్ పెట్టుబడులు

Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి

Updated Date - Aug 09 , 2025 | 09:08 PM