NTPC: తెలంగాణలో ఎన్టీపీసీ రూ. 80 వేల కోట్ల ఫ్లోటింగ్ సోలార్ పెట్టుబడులు
ABN , Publish Date - Aug 09 , 2025 | 08:24 PM
తెలంగాణలో NTPC 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ.. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై..
హైదరాబాద్, ఆగష్టు 9 : తెలంగాణకు NTPC పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ.. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్దమైంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను సింగ్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై దాదాపు రూ.80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ (నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు) ద్వారా తెలంగాణలో సుమారు 6,700 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమని సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రానికి శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఎన్టీపీసీ స్పష్టం చేసింది. భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక లాభాలను ఈ తరహా ప్రాజెక్టు లు అందిస్తాయని ముఖ్యమంత్రికి ఎన్టీపీసీ ప్రతినిధులు వివరించారు.
పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్న తెలంగాణకు, ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు కీలక మలుపు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎన్టీపీసీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు అనువైన వనరులుగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి