Share News

Bengaluru Cop Suspended: పోలీస్ యూనిఫామ్‌లో భార్యకు దొంగ వీడియో కాల్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Aug 09 , 2025 | 07:29 PM

కస్టడీలో ఉన్న దొంగ.. ఓ కానిస్టేబుల్ యూనిఫామ్ ధరించి తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Bengaluru Cop Suspended: పోలీస్ యూనిఫామ్‌లో భార్యకు దొంగ వీడియో కాల్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
Bengaluru Cop Suspended Thief Uniform

ఇంటర్నెట్ డెస్క్: దొంగ చేసిన తుంటరి పని ఓ కానిస్టేబుల్ కొంప ముంచింది. సస్పెన్షన్ వేటు పడేలా చేసింది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. పోలీస్ కస్టడీలో ఉన్న దొంగ ఓ కానిస్టేబుల్ యూనిఫామ్‌ ధరించి తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో కానిస్టేబుల్‌పై సీరియస్ అయిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, సలీమ్ అనే దొంగ దాదాపు 50 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతేడాది అతడిని గోవిందపుర స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దోచుకున్న వస్తువులను రికవరీ చేసే క్రమంలో సలీమ్‌ను బెంగళూరు శివారలోని ఓ హోటల్ ఉంచారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సోనార్‌, మరో పోలీసు సలీమ్‌ను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లారు. ఆ సమయంలో సలీమ్ తన భార్యను ఇంప్రెస్ చేసేందుకు సోనార్‌ యూనిఫామ్‌‌ను ధరించి ఆమెకు వీడియో కాల్ చేశాడు.


ఆ తరువాత ఇందిరానగర్‌లో జరిగిన మరో చోరీ కేసులో పోలీసులు ఈ ఏడాది మే నెలలో మరోసారి సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి ఫోన్‌ను చెక్ చేయగా అతడు పోలీస్ యూనిఫామ్‌ ధరించి ఉన్న ఫొటోలు, స్క్రీన్ షాట్స్ కనిపించాయి. ఆ యూనిఫామ్‌పై సోనార్‌ పేరున్న బ్యాడ్జ్ కూడా కనిపించింది. దీంతో, అతడి యూనిఫామ్‌నే సలీమ్ ధరించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనకు సోనార్‌ బాధ్యుడని డీసీపీ (ఈస్ట్) దేవరాజ్ తెలిపారు. ‘సలీమ్‌ను గోవిందపుర పోలీసులు గతంలో ఓ చోరీ కేసులో అరెస్టు చేశారు. దొంగిలించిన సొత్తును రికవరీ చేసే క్రమంలో అతడిని ఓ హోటల్‌లో ఉంచారు. ఆ సమయంలో సోనార్‌ యూనిఫామ్‌‌ను సలీమ్ ధరించి తన భార్యకు వీడియో కాల్ చేశాడు’ అని డీసీపీ తెలిపారు.

ఘటనపై ఇందిరానగర్ ఇన్స్‌పెక్టర్ దాఖలు చేసిన రిపోర్టు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు సోనార్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు సస్పెండ్ చేశారు. సలీమ్‌కు పోలీసులు మద్దతు కూడా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కనీస బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెంపు.. ఐసీఐసీఐ బ్యాంకుపై విమర్శలు

కొలీగ్‌కు లవర్‌ను వెతికిపెడితే బోనస్.. అమెరికా టెక్ కంపెనీ ఆఫర్

Read Latest and Viral News

Updated Date - Aug 09 , 2025 | 07:44 PM