Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:41 PM
సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల వివాదం రోజుకో ఆసక్తికర వార్తతో ముందుకొస్తోంది. తాజాగా ఈ వివాదం విషయంలో మెగాస్టార్ చిరంజీవి వార్తల్లోకెక్కారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు.. తాను వారిని కలిశానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల 30 శాతం వేతన పెంపు వంటి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని మెగాస్టార్ తేల్చి చెప్పారు. ఇది ఒక పరిశ్రమ సమస్య అని, తనతో సహా ఏ వ్యక్తీ దీన్ని పరిష్కరించడానికి ఏకపక్ష హామీలు ఇవ్వలేరని వివరించారు. ఫిల్మ్ ఛాంబర్ అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అత్యున్నత సంస్థ మాత్రమే అని తెలిపారు. ఆ సంస్థ మాత్రమే.. సమష్టిగా సంబంధిత వారందరితో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గందరగోళం సృష్టించే ఇటువంటి నిరాధార, ప్రేరేపిత వాదనలన్నింటినీ ఖండిస్తున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నాయని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని. దీనిపై ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే చర్చలపై నిర్మాతలు సరిగ్గా స్పందించకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. అయితే సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు కూడా జరిపారు. రోజుకో మలుపు తీసుకుంటున్న సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం ఎలా పరిష్కారం అవుతుందో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు