HCA Case: HCA కేసులో కీలక మలుపు.. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ..
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:54 PM
ఇప్పుడు HCA ఖాతాలో కేవలం 40 కోట్లు మాత్రమే ఉందని సీఐడీ పేర్కొంది. 20 నెలలో 200 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. దేని కోసం ఖర్చు చేశారో.. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడనుందని స్పష్టం చేసింది.
హైదరాబాద్: హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు సీఐడీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సిద్ధం అయ్యింది. ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగంపై క్లారిటీకి రానుంది. జగన్ మోహన్ రావ్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయిన నాటి నుంచి BCCI నుంచి HCAకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు చేశారని CID తెలిపింది.
ఇప్పుడు HCA ఖాతాలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఉందని సీఐడీ పేర్కొంది. 20 నెలలో 200 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించామని చెప్పుకొచ్చింది. దేని కోసం ఖర్చు చేశారో.. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడనుందని స్పష్టం చేసింది. 2014 నుండి HCA అక్రమాలపై ఇప్పటికే రెండు సార్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లు అధికారులు గుర్తు చేశారు. తాజాగా మరోసారి HCA కేసులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు CID వెల్లడించింది.
హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసులో నకిలీ బిల్స్‌తో బీసీసీఐ గ్రాంట్లు, హెచ్‌సీఏ నిధులను కొల్లగొట్టినట్లు ఇటీవల సీఐడీ అధికారులు తెలిపారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌చందర్ నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న దేవరాజ్‌ను గత నెల 25న పుణెలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఈ నెల 7 నుంచి 13 వరకు కస్టడీలోకి తీసుకుని అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం.
శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించారు. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్‌కు అందించారు. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి