BRS vs Congress: కాంగ్రెస్ ధోకా కార్డుపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:05 PM
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుతో గుర్తు చేస్తే... ధోకా కార్డును తెరపైకి తెస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు గుప్పించారు.
హనుమకొండ, అక్టోబర్ 7: కాంగ్రెస్ ధోకా కార్డు విడుదలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు (BRS Former MLAs) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాకీ కార్డుకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు యూరియా దొరకడం లేదని తాము నిరసనలు చేస్తుంటే... కాళేశ్వరం రిపోర్టు తెరపైకి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుతో గుర్తు చేస్తే... ధోకా కార్డును తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని వినయ్ భాస్కర్ ఆరోపణలు గుప్పించారు.
ప్రజలకు ధోకా చేసిందే కాంగ్రెస్: రాజయ్య
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాంగ్రెస్ ధోకా కార్డు విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు చేశారు. అలవికానీ హామీలు ఇచ్చి ప్రజలకు అసలు ధోకా చేసిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ తీరు దొంగే దొంగా అన్నట్టుగా ఉందని విమర్శించారు. దేవుళ్లపై ఒట్టేసి మాట ఇచ్చారని.. 22 నెలలుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. దేవాదులకు ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టేటందుకు అప్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ వెంటాడుతాం, వేటాడుతామని రాజయ్య స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు: ధర్మారెడ్డి
కాంగ్రెస్ విడుదల చేసింది ధోకా కార్డు కాదు దొంగ కార్డు అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపుతోందన్నారు. బీసీ కార్డుతో లబ్ది పొందాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు. జనాభా లెక్కలు చూడకుండా ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు ఖరారు చేశారని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. కేసీఆర్ పథకాలే తప్ప... కాంగ్రెస్ చేసిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే కమీషన్, కాంగ్రెస్ అంటే కరెన్సీ, కాంగ్రెస్ అంటే కుంభకోణం అని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అమలవుతున్నాయని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే
Read Latest Telangana News And Telugu News