Share News

Book Fair Society: బుక్‌ఫెయిర్ సొసైటీ అక్రమాలు వెలుగులోకి.. నిజమెంత?

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:04 PM

పుస్తకాల పండుగను అడ్డుపెట్టుకొని 2014 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించిన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వర రావు... ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత కార్యవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Book Fair Society: బుక్‌ఫెయిర్ సొసైటీ అక్రమాలు వెలుగులోకి.. నిజమెంత?
Book Fair Society

హైదరాబాద్, డిసెంబర్ 22: కొన్ని పుస్తకాలు రుచి చూడాలి. మరికొన్నింటిని మింగాలి. ఇంకొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి' అంటారు ఓ ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త. దీన్ని అక్షరాలా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ పాత కార్యవర్గం నిజం చేశారా? అంటే అవుననే అంటున్నారు కొత్తకార్యవర్గ సభ్యులు. కాకపోతే పుస్తకాల సారాన్ని జీర్ణంచేసుకోవడం కాదు. పుస్తకాల పండుగను అడ్డుపెట్టుకొని 2014 నుంచి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించిన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వర రావు... ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత కార్యవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు.


వారు బాధ్యతలు నిర్వర్తించిన పదేళ్లకు సంబంధించిన ఆర్థికలావాదేవీల తాలూకూ రసీదులు, మినిట్ పుస్తకాలు, ఓచర్లు, బ్యాంకు స్టేట్మెంట్‌కు సంబంధించి ఒక్క కాగితం కూడా తమకు అప్పగించలేదని ప్రస్తుత అధ్యక్షుడు, కవి యాకూబ్ చెప్పారు. నిన్న (ఆదివారం) బుక్‌ఫెయిర్ సొసైటీ ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ... జావాబుదారీగా లేని కారణంగానే కోయ చంద్రమోహన్‌కు చెందిన తెలంగాణ పబ్లికేషన్ స్టాల్ నిరాకరించామని స్పష్టం చేశారు. అదీ ముందస్తుగా నాలుగు సార్లు లేఖలు పంపించినా అవతలి వారి నుంచి స్పందన రాకపోవడంతో సర్వసభ్య కమిటీ సమష్టి నిర్ణయంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. అతని చిత్తశుద్ధి లేమిని తెలంగాణ అస్తిత్వానికి ముడిపెట్టడం సమంజసం కాదని ఆక్షేపించారు. ఇప్పటికైనా తాము అడిగిన వాటిని వారంలోగా అందిస్తానని లేఖరాసిస్తే, తెలంగాణ పబ్లికేషన్స్‌కు స్టాల్ కేటాయిస్తామని ప్రకటించారు.


ఆ లెక్కలు తేలాలి...

బుక్ ఫెయిర్ సొసైటీకి 1986 నుంచి వాడుకలోని బ్యాంకు ఖాతాను కాకుండా 2016లో మరో కొత్త ఖాతా తెరిచి తిరిగి 2024లో కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరించే సమయాన రద్దు చేయాల్సిన అవసరమేంటి? అని ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా 'ది హైదరాబాద్ బుక్ ఫెయిర్ పేరుతో 2021లో మరొక కొత్త బ్యాంకు ఖాతా తెరిచి, అదీ ఎందుకు మూసేశారు! ఈ ఖాతా ద్వారా ఒక కన్వెన్షన్ సెంటర్‌కు పలు సందర్భాలలో మొత్తం రూ.32 లక్షలు బదలాయించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. జూలూరు బృందం సారథ్యంలోని 8 పుస్తక ప్రదర్శనలకు సంబంధించిన పుడ్‌కోర్టు అద్దెలు, ప్రవేశ టికెట్ల విక్రయాలతో పాటు ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం బ్యాంకు ఖాతాలో ఎందుకు జమచేయలేదని ప్రస్తుత సొసైటీ నిర్వాహకులు నిలదీశారు. పదేళ్లుగా పాత కమిటీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై పలుసార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం రాకపోవడంతోనే గౌరీశంకర్, చంద్రమోహన్, రాజేశ్వరరావు, శృతికాంత్ భారతి సభ్యత్వాలను కూడా బ్లాక్‌ లిస్టులో ఉంచినట్లు ప్రకటించారు.


విశ్రాంత న్యాయమూర్తితో విచారణ..

ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యవర్గం 2014కు ముందు ఇచ్చిన పిక్స్‌డ్ డిపాజిట్లు వడ్డీ సహా రూ.78 లక్షలు కాగా ఆ సొమ్మును మాత్రమే 2024లో కోయ చంద్రమోహన్ కొత్త కమిటీకి అప్పగించారని ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొసరాజు సురేష్ చెప్పారు. అంతకుమించి గత పదేళ్లకు సంబంధించి పాత కమిటీ ఒక్క రూపాయి కూడా మిగులు చూపించ లేదన్నారు. ఏడాదికి సుమారు 60 లక్షలకుపైగా టర్నోవర్ కలిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి ఇంత వరకు సొంత కార్యాలయం లేకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో గతంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలకు ప్రభుత్వం రూ.10 లక్షలకు పైగా అందించినట్లు తెలుస్తోందని.. అది కూడా బ్యాంకు ఖాతాలో కనిపించడంలేదని కార్యదర్శి వాసు తెలిపారు. పదేళ్లలో సుమారు రూ.60లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవినీతి జరిగి ఉండచ్చని కొందరు స్టాల్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ వంటి పెద్దల నేతృత్వంలో ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కొందరు సూచిస్తున్నారని తెలిపారు.


పుస్తకానికి చెదలు కొత్తేమీకాదు..

పుస్తక పఠనం మనిషిని ఉన్నతీకరిస్తుందన్న ఓ మహానుభావుడి మాట నిజమే కానీ అంతకు మించి ఇదే పుస్తకాన్ని అడ్డుపెట్టుకొని, ఆదర్శాలు వల్లెవేస్తూ అవినీతికి పాల్పడిన చరిత్ర హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి ఉందంటే అతిశయోక్తి లేదు. ఇరవై ఏళ్ల కిందట అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఓ సామ్యవాది సొమ్ముకాజేయడమే కాకుండా, అధికార పీఠాన్ని వదిలేదే లేదని మంకుపెట్టి కూర్చున్నాడు. దాంతో పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరడంతో అప్పుడు ఆ అధ్యక్షుల వారు సర్దుకొని సొంతూరుకెళ్లారు. ఇక 2014కు ముందు కూడా కార్యదర్శిగా వ్యవహరించిన మరొక జ్ఞానపిపాసి లక్షలు నొక్కేస్తే, కమిటీలోని కమ్యూనిస్టు సానుభూతిపరులు పెద్దమనసుతో క్షమించి వదిలేశారు.


ఇవి కూడా చదవండి...

శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు మరోసారి బాంబు బెదిరింపులు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 12:26 PM