BIG BREAKING: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:29 AM
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదముద్ర పడింది. బీసీ బిల్లుతోపాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి.
రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. . బీసీ బిల్లు గురించి రేపు (సోమవారం) తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అన్ని పార్టీల ప్రతినిధులతో కలుస్తామని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్‌మెంట్‌లను తాము అడుగుతున్నామని... కానీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ చేశారు
గవర్నర్‌ను కలిసి తెలంగాణలో ఉన్న పరిస్థితిని వివరిస్తామని అన్నారు. రాష్ట్రంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ విధానాన్ని గవర్నర్‌కు చెబుతామని.. నిర్ణయం వారి ఇష్టమని తెలిపారు. న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. అసెంబ్లీలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బలహీన వర్గాల మేధావులు తమ ప్రయత్నాన్ని గుర్తించాలని కోరారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..