Police Warning: కొత్త సంవత్సరం వేళ ఆ లింక్‌లపై జాగ్రత్త..
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:15 AM
కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ వచ్చే లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: మరికొద్ది గంటల్లో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం వేళ పోలీసులు ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరిస్తున్నారు పోలీసులు. న్యూఇయర్ విషెస్ పేరిట వచ్చే లింక్ మెసేజ్ మోసాలపై హెచ్చరికలు జారీ చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా సైబర్ నేరగాళ్లు ‘Happy New Year’ శుభాకాంక్షలు, గిఫ్ట్లు, ఆఫర్ల పేరుతో వాట్సప్‌లో నకిలీ లింక్‌లను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ లింక్‌లు తరచుగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు సంవత్సరాంత ఆఫర్లు, నూతన సంవత్సరం బహుమతులు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్ టికెట్లు లేదా పండుగ ఆఫర్లు పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేస్తే, మీ ఫోన్లో హానీకరమైన ఏపీకే (APK) ఫైల్ రహస్యంగా ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ మాల్వేర్ ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్స్, ఫోటోలు, వాట్సాప్ ప్రాప్యతను దొంగిలించగలదన్నారు. దీంతో నేరగాళ్లు మీ పేరుతో ఇతరులను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఈ లింక్‌లు తరుచుగా పరిచయమైన వ్యక్తులు లేదా కుటుంబ గ్రూపుల ద్వారా ఫార్వర్డ్ అవుతాయని.. అందువల్ల అవి నిజమైనవిగా అనిపిస్తాయన్నారు. యాప్ ఇన్స్టాల్ చేయమని లేదా అప్‌డేట్ చేయమని కోరే శుభాకాంక్షలు/గిఫ్ట్ లింక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదివండి...
పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..
Read Latest Telangana News And Telugu News