Share News

Hyderabad: ప్రతీ ఇంటికి.. ప్రతీ రోజూ.. తాగునీటిని అందించేలా వాటర్‌బోర్డు ప్రణాళికలు..

ABN , Publish Date - Dec 31 , 2025 | 10:00 AM

హైదరాబాద్ మహానగర వాసులకు ప్రతిరోజూ ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు వాటర్ బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం రెండురోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే.. పెరిగుతున్న అవసరాల రీత్యా ప్రతిరోజూ నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Hyderabad: ప్రతీ ఇంటికి.. ప్రతీ రోజూ.. తాగునీటిని అందించేలా వాటర్‌బోర్డు ప్రణాళికలు..

- గోదావరి ప్రాజెక్టు ఫేజ్‌-2, 3 పనులు ప్రారంభం

- 2027 చివరి నాటికి రోజూ నీటి సరఫరాయే లక్ష్యం

- వంద శాతం మురుగు శుద్ధికి ప్రణాళికలు

హైదరాబాద్‌ సిటీ: కోటిన్నరకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటి సరఫరా అందించేందుకు వాటర్‌బోర్డు భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలు తీసుకొచ్చి సరఫరా చేస్తోంది. గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టులను సైతం ప్రారంభించి 2027 చివరి నాటికి ప్రతి ఇంటికీ, ప్రతి రోజూ నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి తెలంగాణ క్యూర్‌ ప్రాంతానికి 24/7 నీటి సరఫరా చేసేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపకల్పన చేయనుంది.


అపర భగీరథ ప్రయత్నం

గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఫేజ్‌-2, 3లకు రూపకల్పన చేసింది. 2027 సంవత్సరానికి హైదరాబాద్‌ నగర తాగునీటి డిమాండ్‌ 835 ఎంజీడీలు, 2047 నాటికి 1114 ఎంజీడీలు పెరుగుతుందని బోర్డు అంచనా వేసింది. ప్రస్తుతానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి యత్నిస్తోంది. అలాగే మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి వాటర్‌బోర్డు అపర భగీరథ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. రూ.7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2,3 ప్రాజెక్టు మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, నీటి శుద్ది కేంద్రాల పనులు శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది.


వంద శాతం మురుగు శుద్ధికి..

మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసేందుకు, మూసీనది, చెరువుల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో 972 ఎంఎల్‌డీల సామర్థ్యం గల 39 ఎస్టీపీల పనులు ప్రారంభమయ్యాయి. అమృత్‌-2.0లో భాగంగా రూ.3849.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు 2026 నాటికి పూర్తవుతాయి. అవి అందుబాటులోకి వస్తే 2,850 ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం లభించనుంది. 2036 వరకు అవసరాలను తీర్చగలదు. మూసీనదిలోకి మురుగు చేరకుండా ట్రంక్‌ లైన్లు వేసేందుకు రూ.4,700కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు. 2036 వరకు ఔటర్‌ పరిధిలో వందశాతం మురుగు శుద్ధి చేయడానికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధమవుతోంది.


city6.2.jpg

వచ్చే వేసవికి పకడ్బందీ ప్రణాళికతో..

వచ్చే వేసవిలో నగరవాసులకు తాగునీటి ఇక్కట్లు రాకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు. గత వేసవిలో సగటున 14 నుంచి 28 మీటర్ల వరకు భూగర్భజల నీటిమట్టాలు పడిపోయాయి. వాటర్‌బోర్డు చేపట్టిన ‘ఇంకుడు గుంతల యజ్ఞం’, నగరంలో నమోదైన అధిక వర్షపాతంతో రెండు నుంచి 11 మీటర్లకు వరకు పైకి చేరుకున్నాయి. గతేడాదితో పోల్చితే సగటున మూడు నుంచి 9 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగినట్లు భూగర్భజల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అదునుగా వాటిని సంరక్షించి, మరింత పెంపునకు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణకు దిగారు. వర్షపునీటి సంరక్షణకు నడుం బిగించారు. ఇప్పటి వరకు 16 వేల గృహాలకు నోటీసులు చేసి ఇంకుండు గుంత నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టారు. మరో 25 వేల గృహాలకు వచ్చే మార్చి నాటికి ఇంకుగుంతలు చేపట్టేలా కార్యాచరణ రూపకల్పన చేశారు.


భవిష్యత్‌ ప్రాజెక్టులు - కార్యాచరణ..

మహానగరంలో ప్రతీ పౌరుడికీ సమానంగా, సుస్థిరంగా 24 గంటల పాటు తాగునీరు, మురుగు సేవలను అందించేందుకు వాటర్‌బోర్డు భవిష్యత్‌ ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌లో రోజు విడిచి రోజు నీరు అందిస్తుండగా, ఔటర్‌ పరిధిలో మూడు, నాలుగు రోజులకు నీరందిస్తున్నారు. అయితే 2027 చివరి నాటికి ప్రతి రోజు నీటి సరఫరాకు ప్రాజెక్టులు చేపడుతోంది. కోకాపేట్‌ నీయోపోలిస్‌ లేఅవుట్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ను రూ.298కోట్లతో చేపడుతున్నారు.


నీటి సరఫరా కోసం మహేంద్రహిల్స్‌లో మరో 5మిలియన్‌ లీటర్ల రిజర్వాయర్‌ను, ఆస్మాన్‌గఢ వద్ద 7.5మిలియన్‌ లీటర్ల రిజర్వాయర్‌ను నిర్మించడానికి రూ.30కోట్లను వ్యయం చేయనున్నారు. అదేవిధంగా మంజీర వాటర్‌ సప్లయ్‌ నెట్‌వర్క్‌ను రూ.722కోట్లతో చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఉస్మాన్‌ సాగర్‌ కండూట్‌ను పునరుద్ధరించనున్నారు. 21మిలియన్‌ గ్యాలన్ల నీటిని ప్రతీరోజు తీసుకొచ్చేందుకు రూ.282కోట్లతో అదనపు పైపులైన్‌ను నిర్మాణం చేయనున్నారు. ఔటర్‌ వెంట 140కిలోమీటర్ల మేర రేడియల్‌ రింగ్‌ మెయిన్‌తో పాటు మరో 98కిలోమీటర్ల మేర లింకు పైపులైన్లతో రూ.8వేల కోట్లకు ప్రతిపాదనలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ

మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2025 | 10:02 AM