Minimum Support Price: మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:58 AM
రాష్ట్రంలో పప్పుధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్క్‌ఫెడ్‌తో పాటు నాఫెడ్ లేదా జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య నేరుగా కొనుగోలు కేంద్రాలు...
కేంద్రం ఆమోదంతో రంగంలోకి మార్క్‌ఫెడ్
2 నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతులు రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేసుకోవాలని అధికారుల సూచన
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పప్పుధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్క్‌ఫెడ్‌తో పాటు నాఫెడ్ లేదా జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో జనవరి 2 నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభించాలని మార్క్‌ఫెడ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఖరీఫ్ -2025లో ధరల మద్దతు పథకం కింద 1,16,690 టన్నుల కందులు, 28,440 టన్నుల మినుములు, 903 టన్నుల పెసలు సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్ లో నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కందులు క్వింటా రూ.8 వేలు, మినుములు రూ.7,800, పెసలు రూ.8,768 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయనుంది. మినుము ఉత్పత్తిలో 62ు, కందిలో 32ు, పెసలులో 23ు ధరల మద్దతు పథకం కింద సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఖరీఫ్ లో రాష్ట్రంలో 4.11 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయగా, ఇందులో ఎక్కువ భాగం అనంతపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో సాగైంది. ఈసారి 4.64 లక్షల టన్నుల కందులు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేశారు. మినుము 33,468, పెసర 5,419 హెక్టార్లలో సాగయ్యాయి. మినుము, పెసర ఇప్పటికే కోతలు పూరై, రైతులు చాలా వరకు అమ్మేశారు. మినుము రూ.7,700, పెసలు రూ.7,500 మాత్రమే పలికింది. కంది పంట ఇప్పుడిప్పుడే కోతకు వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కందులు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,300 మధ్య ధర పలుకుతోంది. రానున్న రెండు నెలలు కంది కోతలు పూర్తై, పంట మార్కెట్‌కు విరివిగా రానుంది.
కంది రైతులు నమోదు చేయించుకోవాలి
ప్రభుత్వ ఆదేశాలతో సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, గ్రామ సమాఖ్యల ద్వారా పప్పు ధాన్యాలను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయడానికి జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదాములు, రవాణా, హమాలీ కూలీ రేట్లను ఖరారు చేస్తున్నారు. కాగా, కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ కందులు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు. కంది రైతులు రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కోరారు. ఇప్పటికే 7,175 మంది నమోదు చేయించుకున్నారని చెప్పారు. జేసీ అధ్యర్యంలో జిల్లాస్థాయి సేకరణ కమిటీ ద్వారా మార్క్‌ఫెడ్ మేనేజర్ కందుల కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తారని వివరించారు.