Domestic Violence: భార్యను ముక్కలు చేసి మూసీలో పారేశాడు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:39 AM
ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు.
5 నెలల గర్భిణిని హతమార్చిన భర్త
హైదరాబాద్ బోడుప్పల్‌లో దారుణం
ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం
పెళ్లయిన మూడు నెలలకే గొడవలు, గృహహింస కేసు
భార్య పుట్టింటికి వెళ్తానని అడిగినందుకు మళ్లీ గొడవ పథకం ప్రకారం హత్య
శవాన్ని ముక్కలు చేసి, 3 విడతల్లో నదిలోకి.. ఇంట్లోనే ఉన్న మొండెం
భార్య కనిపించడం లేదని ఠాణాకు.. విచారణలో హత్యను పసిగట్టిన పోలీసులు.. నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ/పీర్జాదిగూడ, వికారాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు. ఆపై, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారిన ఆ భర్త.. భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని విడతలవారీగా మూసీ నదిలో పారేశాడు. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచి.. నా భార్య కనిపించడం లేదు సాయం చెయ్యండంటూ పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఆ కిరాతకుడు.. విచారణలో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్, మేడిపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో వెలుగుచూసిన ఈ ఘటనలో వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి(21) తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఆదివారం విలేకరులకు వెల్లడించారు.
పెళ్లయిన మూడు నెలలకే వేధింపులు
డీసీపీ కథనం ప్రకారం.. కామారెడ్డిగూడలో పక్కపక్క ఇళ్లలో ఉండే మహేందర్‌రెడ్డి (27), స్వాతి (21) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవ్వరికీ తెలియకుండా గతేడాది జనవరిలో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా సయోధ్య కుదుర్చిన పెద్దలు.. యాదగిరిగుట్టలో మరోమారు పెళ్లి చేశారు. అనంతరం వీరు బోడుప్పల్‌లోని బాలాజీనగర్‌లో కాపురం పెట్టారు. ఇంటర్ వరకు చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తుండగా, డిగ్రీ మధ్యలోనే ఆపేసిన స్వాతి టెలీకాలర్‌గా పని చేస్తోంది. అయితే, పెళ్లయిన నెల రోజులు తర్వాత దంపతుల మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయి. పెళ్లయిన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పి మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత భర్త వేధింపులు భరించలేకపోయిన స్వాతి వికారాబాద్ మహిళా పోలీసుస్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది. గ్రామపెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. కానీ, స్వాతిపై కోపం పెట్టుకున్న మహేందర్ రెడ్డి ఆమెను మరింత వేధించడం మొదలుపెట్టాడు. స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా, కలవకుండా కట్టడి చేసేవాడు. ఈ గొడవలు కొనసాగుతుండగా మరోమారు గర్భం దాల్చిన స్వాతి ఇటీవల స్వగ్రామానికి వెళ్లింది. మహేందర్ రెడ్డి వద్దకు వెళ్లనంటే పెద్దలు సర్దిచెప్పడంతో 20 రోజుల క్రితమే తిరిగి బోడుప్పల్‌కు వచ్చింది.
గొంతు నులిమి చంపి.. ముక్కలు చేసి
5 నెలల గర్భిణి అయిన స్వాతి వినాయకచవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానని 22వ తేదీ, శుక్రవారం భర్తకు చెప్పింది. ఇందుకు మహేందర్ రెడ్డి ఒప్పకోకపోవడంతో ఆ రోజు రాత్రి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు, శనివారం(ఆగస్టు 23) ఉదయం 11 గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు. అయితే, భార్యను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్.. ఉదయం 11:30 గంటలప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగొచ్చాడు. వచ్చేటప్పుడు ఓ ఎక్సా బ్లేడు కొనుగోలు చేసి తెచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతునులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి ఎక్సా బ్లేడుతో ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులను మొండం నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి మూటగట్టాడు. మొండెంను మాత్రం ప్లాస్టిక్ కవర్‌లతో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు. పరుపును మడిచి మూటగట్టి ఓ మూల పెట్టాడు. రాత్రి ఏడు గంటల తర్వాత ఒక్కో మూటను బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ద్విచక్రవాహనంపై వెళ్లి ప్రతాపసింగారం ప్రాంతంలోని మూసీ నదిలో పారేశాడు.
భార్య కనిపించడం లేదని నాటకం
హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి మరో నాటకానికి తెర తీశాడు. మేము బానే ఉన్నాం, ఇప్పుడే భోజనం చేశామంటూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అలాగే, తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ నమ్మబలికాడు. ఆ మాటలను నమ్మని ఆమె.. వెంటనే తన భర్తను మహేందర్ రెడ్డి వద్దకు పంపింది. బావ వచ్చే లోపు కాళ్లు, చేతులు, తలను మహేందర్ రెడ్డి మూసీలో పడేశాడు. మహేందర్‌రెడ్డిని కలిసిన అతని బావ ఏం జరిగిదంటూ వాకబు చేశాడు. హత్య సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అతని వద్ద వాపోయాడు. దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉప్పల్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. మహేందర్ రెడ్డి నివాసమున్న ప్రాంతం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయితే, కేసు నమోదులో భాగంగా ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి వేసిన ప్రశ్నలకు మహేందర్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇవ్వగా.. ఇన్‌స్పెక్టర్ గట్టిగా ప్రశ్నించడంతో చేసిన దారుణాన్ని బయటపెట్టాడు. వెంటనే మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
దొరకని స్వాతి శరీర భాగాలు
మహేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఉదయం స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలింపు చేపట్టారు. కానీ, మూసీలో వరద ఉండడంతో ఫలితం లేకపోయింది. స్వాతి మొండాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ప్రేమంటూ నా బిడ్డను అంతం చేశాడు: స్వాతి తండ్రి
ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకొని లొంగదీసుకుని తమ బిడ్డను తమకు దూరం చేసిన మహేందర్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేశాడంటూ స్వాతి తండ్రి రాములు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బోరున విలపించారు. పెళ్లయిన నెల రోజుల నుంచే వేధించడం మొదలుపెట్టాడని, ఇప్పుడు గర్భవతి అని తెలిసి కూడా దారుణంగా హతమార్చాడంటూ ఆయన రోదించారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా బిడ్డ బాగుంటే చాలు అనుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. ఇక, శనివారం ఉదయమే స్వాతితో ఫోన్‌లో మాట్లాడానని, అర్ధరాత్రి రెండు గంటల తర్వాత పోలీసులు వచ్చి విషయం చెప్పడంతో గుండె పగిలినంత పనైందని స్వాతి తల్లి స్వరూప విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News