High Court: సౌండ్ సిస్టం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకే..
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:02 AM
గణేశ్ మండపాల వద్ద కాలుష్య చట్టంలోని నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను అనుమతించాలి.
ధ్వని స్థాయిని పోలీసులు పర్యవేక్షించాలి
ట్రాఫిక్ సమస్య ఏర్పడనివ్వొద్దు
నిబంధనలు పాటించాలి.. నిమజ్జనం తర్వాత మండపాల ప్రాంగణం శుభ్రం చేయాలి
గణేశ్ మండపాల నిర్వాహకులకు హైకోర్టు మార్గదర్శకాల జారీ
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గణేశ్ మండపాల వద్ద కాలుష్య చట్టంలోని నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను అనుమతించాలి. మైక్‌లను నిర్దేశించిన డెసిబెల్ స్థాయి దాటకుండా పరిమితి పాటించాలి. ఆస్పత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాల వైపు లౌడ్ స్పీకర్లు పెట్టరాదు. డెసిబుల్ మీటర్లతో ధ్వని స్థాయిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ట్రాఫిక్ ఆగిపోకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే. నిమజ్జనాల తర్వాత మండపాల ప్రాంగణాన్ని శుభ్రం చేసే బాధ్యతా వారిదే. ఇవే కాదు.. గణేశ్ మండపాల నిర్వాహకుల కోసం మరిన్ని మార్గదర్శకాలను తాజాగా హైకోర్టు జారీచేసింది. ఆ మండపాలను నిర్వహించే వ్యక్తులు చట్టప్రకారం వ్యవహరించాలని, నిబంధనలు పాటించాలని స్పష్టంచేసింది. నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్య పరిమితి దాటి సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేసింది. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు వీలుగా.. ట్రాఫిక్‌కు సమస్య లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. శబ్దకాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు గతంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుంచుకోవాలని.. విద్యుత్తు కనెక్షన్ కోసం అనుమతి పొందాలని, ఆ కనెక్షన్ పక్కాగా ఏర్పాటు చేయకపోతే విద్యుదాఘాతం, అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొంది. తన ఇంటిని ఆనుకునే అనుమతి లేకుండా గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే 80 ఏళ్ల వృద్ధురాలు, అనధికారికంగా మండపాలు ఏర్పాటు చేశారని పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని చెప్పినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పండగ పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టరాదని స్పష్టంచేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, సమస్యలను దృష్టిలో ఉంచుకుని విగ్రహాల ఏర్పాటుకు మునిసిపల్ అధికారులు, పోలీసులు అనుమతివ్వాలని పేర్కొంది.
ఇవీ నిబంధనలు..
గణేశ్ విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక పోలీసులు, మునిసిపల్ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి. ట్రాఫిక్ సజావుగా సాగేలా, ఇళ్లు, ఆస్పత్రుల ప్రవేశాలకు ఆటంకం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలు.. ఇలా అత్యవసర పరిస్థితులు ఉంటే వాటిని అడ్డుకునేలా ఉండకూడదు. వీలైనంత వరకు విగ్రహాలను వివిధ ప్రాంతాల్లోని కమ్యూనిటీ మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా పందిళ్లకు విద్యుత్తు కనెక్షన్ పక్కాగా తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించుకోవాలి. స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. నిమజ్జనం, ఊరేగింపుల సమయంలో మునిసిపల్, పోలీస్ అధికారులు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి. కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ అనుకూల విగ్రహాలు, పూజా వస్తువులను ఎంచుకోవాలి. శబ్ధ, పర్యావరణ నియమాలను పాటించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..