Share News

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:14 AM

వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది.

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

  • రూ.261 కోట్ల విడుదలకు సర్కారు కసరత్తు

  • గతంలో 83,887 మంది కూలీలకే ఆర్థిక సాయం

  • మిగిలిన 4,35,304 మందికి ఇప్పుడు చెల్లింపులు

  • బిల్లులు సమర్పించిన గ్రామీణాభివృద్ధి శాఖ

  • ఉద్యోగుల వేతనాల చెల్లింపులు

  • పూర్తవగానే భరోసాకు నిధుల కేటాయింపు

  • ‘తొలి విడత’ వేగంగా పూర్తికి నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న రూ.261 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డు కలిగి ఉన్న, కనీసం 20 పనిదినాలు పూర్తి చేసిన.. భూమి లేని కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,19,191 మంది... ఈ పథకానికి అర్హులని తేల్చింది.


వీరికి ఏడాదికి రూ.12వేల చొప్పున (6 నెలలకోసారి రూ.6వేల చొప్పున రెండు విడతల్లో) ఆర్థిక సాయం అందిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26న పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలివిడత (రూ.6వేల చొప్పున) చెల్లింపుల్లో భాగంగా 83,887 మంది కూలీలకు మాత్రమే రూ.50.33కోట్లు చెల్లించింది. నిధుల కొరత కారణంగా మిగతా 4,35,304 మంది కూలీలకు రూ.261.18కోట్లు చెల్లించలేదు. ఇటీవల రైతు భరోసా చెల్లింపులను ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేసిన నేపథ్యంలో ఆత్మీయభరోసా పెండింగ్‌ నిధులు విడుదల చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా చెల్లిస్తే బాగుంటుందనే చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం.. వెంటనే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు 2024- 25 సంవత్సరానికి సంబంధించి తొలివిడత చెల్లింపులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి బిల్లులు కూడా ఆర్థిక శాఖకు అందినట్లు తెలిసింది. ఒకటి, రెండు తేదీల్లో ఉద్యోగుల వేతనాలు చెల్లించగానే.. ఆత్మీయ భరోసాకు నిధులిచ్చేలా ఆర్థికశాఖ ఏర్పాట్లు చేస్తోంది.


రెండో విడత కూడా చెల్లిస్తారా?

2024-25 సంవత్సరానికి సంబంధించి తొలివిడత ఆత్మీయ భరోసా పంపిణీ పూర్తయితే.. రెండో విడత నిధులు ఎప్పుడు చెల్లిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం 5,19,191 మంది కూలీలకు రెండో విడతలో రూ.6 వేల చొప్పున చెల్లించాలంటే రూ.311.51కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. మార్చి 31తో గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. కానీ, పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మొదటి విడతలోనే కొంత మందికి ఇచ్చి, మిగతా వారికి ఆపేశారు. అయితే, వచ్చే వారం, పది రోజుల్లో మొదటి విడత పూర్తి చేసి, రెండో విడత చెల్లింపులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. వీలైతే రెండో విడత సొమ్మును కూడా జూలైలోనే చెల్లించి, ఒక ఏడాది ఆత్మీయ భరోసా సాయాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..

Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 28 , 2025 | 04:14 AM