CM Revanth Reddy: గోదావరి-బనకచర్ల రాచపుండు రాజేసింది కేసీఆరే
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:49 AM
బీఆర్‌ఎస్ చచ్చిన పాము అని, ఆ పామును బతికించేందుకు గోదావరి-బనకచర్ల వివాదాన్ని వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
చచ్చిన పాము లాంటి బీఆర్‌ఎస్‌ను లేపేందుకే ఈ వివాదం
అబద్ధాలనే నమ్ముకున్న కేసీఆర్ కుటుంబం
తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది వారే
జలవివాదాలపై కేంద్రం పెద్దన్నలా ఉండాలి
రాష్ట్రాల మధ్య వివాదాలు తేల్చకుండా..
జుట్లు పట్టుకొని ఆడించాలనుకుంటోంది
కిషన్‌రెడ్డి తీరు అనుమానం కలిగిస్తోంది
ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే కుట్ర
దుష్ప్రచారాన్ని గ్రామగ్రామానా వివరించాలి
రాష్ట్ర హక్కులను కాపాడటమే లక్ష్యం కావాలి
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం పిలుపు
బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చిద్దాం.. రావాలని బీఆర్‌ఎ్‌సకు రేవంత్ సవాల్
బనకచర్లను అడ్డుకుంది మేమే: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ చచ్చిన పాము అని, ఆ పామును బతికించేందుకు గోదావరి-బనకచర్ల వివాదాన్ని వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నీళ్ల సెంటిమెంటే పార్టీని బతికిస్తుందనుకుంటున్నారని, అందుకోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను భూతాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘క్షుద్రపూజలు చేసే ఫామ్‌హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారంగా మారింది. అందుకే ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే ప్రయత్నాలు చేస్తున్న్డారు. అబద్ధాలతో బతికే బీఆర్‌ఎస్ 2023లో అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. దీంతో నదుల పునరుజ్జీవం పేరుతో బీఆర్‌ఎస్ పునరుజ్జీవం కోసం తాపత్రయ పడుతున్నారు’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మంగళవారం.. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జలవివాదాలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వివాదం పరిష్కారమైతే తెలుగు రాష్ట్రాలు తమ వద్దకు రావని, పంచాయితీ ఇలాగే కొనసాగితే ఇద్దరి జుట్లు పట్టుకొని ఆడించవచ్చనేదే కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. నీటి కేటాయింపులు, హక్కులు కాపాడుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

11 ఏళ్లుగా బీజేపీ నిర్లక్ష్యం..
‘‘నీటి కేటాయింపులపై 11 ఏళ్లుగా బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నేడు పరోక్షంగా బీఆర్‌ఎ్‌సను బతికించడానికి ప్రయత్నిస్తోంది. దీని వెనుక ప్రధాన పాత్ర కిషన్‌రెడ్డిదే. ఆయన మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఇంటినుంచి వచ్చే ప్రెస్‌నోట్‌తోనే మాట్లాడతారు. దీనిపై అధికారికంగా ఆరోపణలుచేస్తున్నా. సీఎంగా మీ(కిషన్‌రెడ్డి) ఇంటికొచ్చి కలిశాను. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా కలిశారు. కలిసినప్పుడు కాగితాలు తీసుకొని.. మేం లేనప్పుడు కేంద్రమంత్రులను కిషన్‌రెడ్డి కలిసి వస్తారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవ డానికి మేము వెళుతున్నామని చెబితే.. ఢిల్లీలో సమావేశం ఉందని ముందే వెళ్లి ఆ మంత్రిని కలిశారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. కిషన్‌రెడ్డి రహస్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తాము మెట్రో కోసం వెళ్లినప్పుడు కూడా ముందే వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారని, కిషన్‌రెడ్డి తీరు అనుమానం కలిగిస్తోందని అన్నారు. ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చింది రాష్ట్ర హక్కులను కాలరాయడానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సాంకేతిక వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయ పరమైన విధానంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై, కిషన్‌రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు గ్రామగ్రామాన మాట్లాడాలన్నారు.
కృష్ణా, గోదావరి జలాలు తాకట్టు..
ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లలో ప్రాజెక్టులు కట్టకుండా కృష్ణా, గోదావరి జలాలను తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయంటూ రాచపుండు పెట్టిందే కేసీఆర్. మనం మెదలకుండా ఉంటే.. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఈ అబద్ధాలను ఎండగట్టాలి. చంద్రశేఖర్‌రావు, హరీశ్‌రావుతోపాటు ఆ కుటుంబమంతా అబద్ధాలనే నమ్ముకున్నారు. అబద్ధాలు చెప్పి బతకడం నేర్చుకున్నారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా.. దీనిపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణా, ఒక రోజు గోదావరి జలాలపై చర్చకు రండి. మీరు ప్రత్యేక సమావేశాల కోసం స్పీకర్‌కు లేఖరాస్తే.. మేము కూడా లేఖ రాస్తాం. గత పదేళ్లలో ఒక్కో జీవో, పేపర్ చదివి వినిపిద్దాం’’ అని సీఎం అన్నారు. గోదావరి-బనచకర్లకు పర్యావరణ అనుమతిని తిరస్కరించడం కామాయే తప్ప.. పుల్‌స్టాప్ కాదని చెప్పారు. ‘‘వాళ్లు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసి, మళ్లీ పర్యావరణ మంత్రిత్వశాఖకు ఇస్తారు. ఎందుకంటే మోదీ మనుగడ చంద్రబాబు మీద ఉంది. చంద్రబాబు మనుగడ గోదావరి బనకచర్లపై ఉంది. ఇదంతా నదుల అనుసంధానం లెక్కనే. ఇందులో రాజకీయ అనుసంధానం ఉంది’’ అని రేవంత్ వివరించారు. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులకు కూడా కేటాయించిన నీటిని పక్కాగా రాసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక్కరోజులోతేలే అంశం కాదని, దీనిని లేవనెత్తాలని, తెలంగాణకు కేసీఆర్ ఏ విధంగా ద్రోహం చేశారో చెప్పాలని అన్నారు. ‘‘మన ఉద్దేశాలు, మన ఆలోచనలు కేసీఆర్‌ను తప్పుబట్టాలని కాదు. కేసీఆర్ శాశ్వతం కాదు.. ఆయన సృష్టించిన సమస్యలు కూడా శాశ్వతం కాదు. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే శాశ్వతం. మన హక్కులే శాశ్వతం. కేసీఆర్‌తో పంచాయితీ పెట్టుకునే కంటే... మన హక్కుల కోసం పోరాడటమే లక్ష్యం కావాలి’’ అని దిశానిర్దేశం చేశారు.
నికర జలాల ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఎగువనఉన్న తెలంగాణ వదిలితేనే నీళ్లు వస్తాయని ఏపీ అంటోందని, అలాంటప్పుడు ఎగువ ప్రాంతంలో నికర జలాలపై ప్రాజెక్టులను కడుతుంటే కింద ఉన్నవారు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ‘‘మీరు బ్లాంకెట్‌గా 45 టీఎంసీలు మాకు ఇవ్వాల్సిందే. మైనర్ ఇరిగేషన్‌లో 90 టీఎంసీలకుగాను 45 టీఎంసీలను పొదుపు చేసి, ఆ నీటిని పాలమూరుకు కేటాయించుకున్నాం. దీనికి మీరు అంగీకరించి నిరభ్యంతర పత్రం ఇస్తే పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు తెచ్చుకొని లోన్లు తెచ్చుకొని ప్రాజెక్టులు కట్టుకుంటాం. నికర జలాల కేటాయింపులతో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతూ... మూడో పంటకు నీళ్లివ్వడానికి వరద జలాలను తీసుకె ళ్లడానికి తాపయత్రం పడుతున్నారు. మాకు ఒక్క పంటకు కూడా నీళ్లు లేవు. మాకు తాగునీటికీ సమస్యలున్నాయి. మీరు ముందుకొచ్చి సహకరించాలి కదా! ఈ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.
కిషన్‌రెడ్డిది దింపుడు కల్లం ఆశ..
నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు తీసుకోరని సీఎం ప్రశ్నించారు. ‘‘సీఆర్ పాటిల్‌కు ఉన్న హోదానే కిషన్‌రెడ్డికి ఉంది. నీటి కేటాయింపులపై మాట్లాడాలని అధికారులను కిషన్‌రెడ్డి దగ్గరికి పంపించాం. ఏపీకి చెందిన కేంద్రమంత్రులు ప్రతి మంత్రి దగ్గరకి పోతున్నరు. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి ఎందుకు పట్టింపులేదు? ఈ వివాదాన్ని పెంచి పోషిస్తే.. మళ్లీ బీఆర్‌ఎస్ బతుకుతుందని, అప్పుడు రాజకీయంగా తమకు ప్రయోజనం ఉంటుందని, తద్వారా కాంగ్రె్‌సను మార్జినలైజ్ చేయవచ్చనేది వీరి (బీజేపీ) విధానం. రాజకీయ మనుగడ కోసమే వారి తాపత్రయం. అంతరించిపోతున్న బీఆర్‌ఎ్‌సను పునరుజ్జీవింపజేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. దింపుడు కల్లం ఆశతో నదీ జలాలను అడ్డంపెట్టుకొని.. దీన్ని వివాదంగా చేసి, మన మీద బురద జల్లి, దోషులుగా నిలబట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నరు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి’’ అని సీఎం సూచించారు.
రాంచందర్‌రావుకు శుభాకాంక్షలు.. ప్రధాని వద్దకు తీసుకెళ్లాలి
‘‘బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావుకు శుభాకాంక్షలు తెలుపుతూనే గోదావరి నది జలాల సమస్యను ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలని కోరుతున్నా. దీన్ని మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి’’ అని రేవంత్ అన్నారు. కాగా, కృష్ణా, గోదావరిపై గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కక్కుర్తి వల్లే ఈ సమస్యలు వచ్చాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బనకచర్లతో గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కోల్పోతామనేది ప్రధాన అభ్యంతరమని, దీనికి వ్యతిరేకంగా గోదావరి బోర్డు నుంచి కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఒక్క చుక్క నీటిపై కూడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉనప్పుడే గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను పెన్నాకు తరలించడానికి 2019 జూన్ 28న, ఆగస్టు 2న, సెప్టెంబరు 23న వరుసగా జగన్‌తో సమావేశాలు జరిగాయని, చర్చలే కాకుండా ఆ దిశలో చాలా ముందుకెళ్లారని మంత్రి ఉత్తమ్ వివరించారు. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అనేది నీటి వాటాపై పోరాటాల మూలసూత్రాలకు వ్యతిరేకమన్నారు. నీటి విషయంలో కేసీఆర్, జగన్‌ల సమావేశం మోసం చేయడానికే జరిగిందని ఆరోపించారు. గోదావరి-బనకచర్లకు పర్యావరణ అనుమతి రాకుండా తాము అడ్డుకున్నామని తెలిపారు. కాగా, గోదావరి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్ ఇవ్వగా.. కృష్ణాపై డీఈఈ వెంకటనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రతిపాదనతోనే గోదావరి-బనకచర్ల
2016 సెప్టెంబరు 21న ఉమాభారతి నేతృత్వంలో జరిగిన భేటీ కేసీఆర్ చేసిన ప్రతిపాదనల ఫలితంగా.. ఆ సమావేశపు పేజీలను చంద్రబాబు దుమ్ము దులిపి గోదావరి-బనకచ ర్ల అనుసంధానం ప్రతిపాదించారని సీఎం రేవంత్ అన్నారు. ఆ సమావేశపు మినిట్స్ 8 పేజీలు ఉంటే... అందులో 6వ పేజీ, రెండో పేరాలో కేసీఆర్ అన్నమాటలను రేవంత్ ఉటంకించారు. ‘కృష్ణా బేసిన్‌కు 1000 టీఎంసీలు కావాలి. గోదావరిలో 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టాలి’ అని కేసీఆర్ ప్రతిపాదించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ‘‘కేసీఆర్‌కు ఏ దేవుడు చెప్పిండో.. ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, లేని ఏకు పెట్టి, రాచపుండు పెట్టారు. ఆ రాచపుండుతోనే రాయలసీమకు గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేయాలని చంద్రబాబునాయుడు వ్యాప్కో్‌సకు 2016లో బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలిదశలోనే 2016-2019 దాకా కేసీఆర్ వ్యతిరేకించలేదు. 2019లో జగన్ రాగానే. మంచి భోజనం పెట్టి, పవర్ పాయింట్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి వారికి గోదావరి జలాలను తరలించడం నేర్పారు’’ అని రేవంత్ వివరించారు. తొమ్మిదిన్నరేళ్లు నీటిపారుదల శాఖలు నిర్వహించిన హరీశ్‌రావు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయని ఆరోపించారు. ‘‘811 టీఎంసీల కేటాయింపులు ఉమ్మడి ఏపీకి ఉన్నాయి. వీటిని ఏ విధంగా వాడుకోవాలనే దానిపై 2015లో చర్చ జరిగితే.. 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు చాలునంటూ సంతకాలు చేశారు. ఇది తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనంగా మారింది. కృష్ణాలో పరివాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉంది. 32 శాతం ఏపీలో ఉంది. దీని ప్రకారమే కేటాయింపులు జరగాలి. 555 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా ట్రైబ్యునల్‌ను కోరుతున్నాం’’ అని అన్నారు.
రాగి సంకటి, రొయ్యల పులుసుకే గోదావరి జలాలు ఇచ్చారు..
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులన్నింటి నీటి కేటాయింపులు, వివాదాలు పరిష్కారమైతేనే మిగులు జలాల లెక్క తేలుతుందని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘సముద్రంలోకి వెళుతున్న నీటిని తాము తీసుకెళుతున్నామని, చంద్రశేఖర్‌రావు 2014- 2023 దాకా తమకు సహకారం అందించారని, రాగి సంకటి, రొయ్యల పులుసుకే నీళ్లు తీసుకోవడానికి వీలు కల్పించారని వారు (ఏపీ) చెబుతున్నారు. ఇప్పుడు ఉత్తమ్, రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారనేది వారి బాధ. మాకు రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ హక్కులతోనే సంబంధం ఉంది. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్రాల హక్కులు తాకట్టుపెడతామా? ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడుతాం’’ అని సీఎం చెప్పారు. బీఆర్‌ఎస్ ధన దాహం తీర్చుకోవడానికి ప్రాజెక్టుల పేరు, ఊరు, అంచనాలు కూడా మార్చిందని ఆరోపించారు. ‘‘2007-08లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. 160 టీఎంసీల నీటిని తరలించి, 16 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి ఈ ప్రాజెక్టును చేపట్టి 2014 నాటికే రూ.10 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పేరిట గ్రావిటీతో నీళ్లిచ్చే ప్రాజె క్టులను మార్చేశారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరంగా మార్చి రూ.1.50 లక్షల కోట్లకు చేర్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు చేరింది. ప్రాజెక్టు పరిపూర్ణం కావాలంటే ఇంకా రూ.50 వేల కోట్ల పనులు చేయాల్సి ఉంది. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి 50 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
For More Telangana News and Telugu News