Share News

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:52 AM

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: నష్టం లెక్కలు వేయండి..

  • పంటలు, ఆస్తుల నష్టం ఫొటోలు, వీడియోలు భద్రపరచండి

  • ఏ సమస్య వచ్చినావెంటనే స్పందించాలి

  • పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించండి

  • వినాయక మండపాల వద్ద విద్యుత్తుతో జాగ్రత్త

  • వరదపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశం

మెదక్‌ అర్బన్‌, హైదరాబాద్‌, పెద్దపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును, కామారెడ్డి వరద ప్రాంతాలను సందర్శించిన అనంతరం కామారెడ్డిలో జిల్లా వరద సమీక్ష నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో కామారెడ్డి ఏరియల్‌ సర్వే ముగించుకొని మెదక్‌ జిల్లాకు వచ్చారు. మెదక్‌ వరద ప్రాంతాలను సందర్శించిన అనంతరం మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ, వివత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండి, ఆస్తి, పంట, ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని, యుద్ధ ప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు. వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌లో భాగంగా ఒక పక్క వరద నష్టాలను అంచనా వేస్తూ మరోపక్క శాశ్వత ప్రాతిపదికన అవసరమైన చోట హైలెవెల్‌ బ్రిడ్జిలు కట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో, వీడియా ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరాలని అధికారులకు సూచించారు. వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మంత్రి ఉత్తమ్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 6.20కు సమీక్ష ముగించుకుని సీఎం ఏడు గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పాత ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే వినాయక మండపాలకు దగ్గర్లో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల కారణంగా ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కతో కలిసి తన నివాసంలో వరద పరిస్థితిపై సమీక్షించారు. పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్యారోగ్య సిబ్బంది అవసరమైన మందులను సరిపడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌లను మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


ఎల్లంపల్లి నిలబడింది.. మేడిగడ్డ కుంగింది

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణపై లోపాలు ఉన్నాయని జస్టిస్‌ ఘోష్‌ నివేదిక ఇచ్చారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాం. మేం కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నిలబడింది.. వాళ్లు (బీఆర్‌ఎస్‌) కట్టిన మేడిగడ్డ కుంగింది.. గోదావరి జలాల ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ఒక జంక్షన్‌, గుండెకాయ’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఏరియల్‌ సర్వేలో భాగంగా ఉత్తమ్‌, మహేశ్‌తో కలిసి ఆయన మొదట ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల పట్టణాలు ఏమైనా నీట మునిగాయా అని పరిశీలించారు. ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద గోదారమ్మకు కొబ్బరి కాయలు కొట్టి పసుపు, కుంకుమ, పూలు, సారె సమర్పించారు. గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలకు నీరు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 03:52 AM