CM Revanth Reddy: సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష.. సామాజిక బహిష్కరణే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:32 AM
ప్రభుత్వం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణే శిక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం
దామాషాలో వారికి దక్కేది వార్డు మెంబరే
నేనే చివరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదు
త్యాగానికి సిద్ధపడే ఈ లెక్కలు తేల్చిన
నాయకుడి మాట పాటించే ఈ స్థాయికొచ్చా
ఈ లెక్కల్ని తప్పుపడితే నష్టపోయేది బీసీలే
ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ..
ఓసీగా పుట్టి కులాన్ని బీసీల్లో చేర్చుకున్నాడు
వర్గీకరణ అమలుకు చట్టం: సీఎం రేవంత్‌రెడ్డి
పేదల కోసం పని చేస్తేనే పదవులు.. ఢిల్లీ పైరవీలతో రావు: యూత్ కాంగ్రె్‌సతో సీఎం
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణే శిక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పు కొట్టాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలకు కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపైన అవగాహనా కార్యక్రమం జరిగింది. కులగణన సర్వేపైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎస్సీ వర్గీకరణపైన మంత్రి దామోదర్ రాజనర్సింహలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఇంత చెప్పినా కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీ్‌షరావులను సామాజిక బహిష్కరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. అత్యంత కీలకమైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపైన కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు.. ప్రభుత్వం తీసుకున్న కులగణన ప్రక్రియ పైన అపోహలు సృష్టించి తప్పుల తడకన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన చేసి, బలహీన వర్గాల వారి జనాభాను లెక్క కట్టి, వారి కోటా వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంటూ రాహుల్ గాంధీ మాట ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాహుల్ మాటను నిలబెట్టే బాధ్యతను తీసుకున్న తాము.. నిర్థిష్టమైన ప్రణాళికతో కులగణన ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ప్రతి 150 ఇండ్లను ఒక యూనిట్ గా తీసుకొని, ఎన్యుమరేటర్లను నియమించి సంపూర్ణ సమాచారాన్ని సేకరించామని చెప్పారు. సర్వే మనమే రాసుకున్నమంటూ కేసీఆర్ లాంటి వారు మాట్లాడతారని ముందే ఊహించి, మాన్యువల్ డాక్యుమెంట్లలో ఇంటి యజమాని, ఎన్‌రోలర్, సూపర్ వైజర్లతో సంతకాలూ పెట్టించామన్నారు.
బలహీన వర్గాల లెక్క తేల్చాం!
బలహీన వర్గాలను ఏబీసీడీఈ కేటగిరీలుగా చేసి.. విడివిడిగా ఎంత మంది ఉన్నారని లెక్క తేలిస్తే.. 56.33 శాతం మంది ఉన్నారని లెక్క తేలిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘మైనార్టీల లెక్క ఎట్ల తీస్తరని కొందరు అంటున్నారు. బీసీ ఈ కోటా కింద 4 శాతం రిజర్వేషన్లు పొందుతున్న మైనార్టీల లెక్క తీయక తప్పదు’’ అని సీఎం చెప్పారు. చెట్ల మీద విస్తర్లు కుట్టినట్లుగా 12 గంటల్లో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ కాకిలెక్కలు అందించారన్నారు. ఎస్సీ ఉప కులాలు ఉన్నదే 59 అయితే సమగ్ర కుటుంబ సర్వేలో 82 ఉపకులాలు ఉన్నట్లుగా తేల్చారని రేవంత్ ప్రస్తావించారు. కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీ్‌షరావులు పాల్గొని వివరాలు ఇచ్చిన తర్వాత లెక్కల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు. సర్వేలోపాల్గొనని కేసీఆర్‌కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే లేదన్నారు. వివరాలు ఇవ్వకుండా జన జీవన స్రవంతిలో లేని 16 లక్షల పైచిలుకు జనాభాలో కేసీఆర్, కేటీఆర్, హరీ్‌షరావు, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి వంటి గ్యాంబ్లర్స్ ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. సర్వేలో పాల్గొనని వారిలో కొందరు విధిలేక, ఆ సమయానికి లేక ఇవ్వక పోవచ్చనని, కేసీర్ లాంటి వారు తెలిసీ.. కావాలనే ఆ లెక్కల్లోకి రాలేదని ఆరోపించారు. ‘‘పోయిన మంత్రివర్గంలో కె.చంద్రశేఖర్‌రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు, దయాకర్‌రావు, వినోద్‌రావు ఆ రావు.. ఈ రావు.. ఇంతమంది ఎట్ల వచ్చినరంటూ ఇప్పుడు బీసీలు నిలదీస్తరనే భయంతోనే లెక్కల్ని గందరగోళం చేసి గంగలో కలపాలని కుట్ర చేస్తున్నరు. లెక్క తేలితే వాళ్లింట్లో వార్డు మెంబర్ తప్ప ఏ పదవీ రాదు’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
లెక్క తప్పంటే మళ్లా మొదటికి వస్తది
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఏ కులాల వారు ఎంతున్నరన్న లెక్కను కాంగ్రెస్ ప్రభుత్వం తేలిస్తే అర్థం చేసుకోకుండా ఈ లెక్కను కొందరు బీసీలు తప్పు పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్క తప్పంటే వ్యవహారం మళ్లీ మొదటికి వస్తదని హెచ్చరించారు. కొందరు తెలియకుండానే కేసీఆర్ కుట్రకు సహకారం అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. సర్వేలో సేకరించిన 8 పేజీల వివరాలు.. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు సంతకం చేసి ఇచ్చినవేనని వివరించారు. సర్వేలో లెక్కలు చెప్పని 3.1 శాతం మంది.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన జీవన స్రవంతిలో కలవాలని, వీరూ లెక్కల్లోకి వస్తే బీసీ, ఎస్సీ, మైనార్టీల శాతం పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
నేనే ఆఖరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదు
‘‘రేవంత్‌రెడ్డే ఆఖరి రెడ్డి సీఎం అంటూ ఒకాయన మాట్లాడారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా ఫర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా, సీఎంగా కులగణన సర్వే బాధ్యత తీసుకున్న. త్యాగానికి సిద్దమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించిన. ఈ లెక్కల్లో తప్పే చేయాలనుకుంటే మా రెడ్డీలను 5 శాతం లోపు.. బీసీలను 50 శాతం పైన ఎందుకు చూపుతా?’’ అని రేవంత్ ప్రశ్నించారు. నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టడమే ధర్మం అనుకుని ప్రతి మనిషి సమాచారం పక్కాగా సేకరించామన్నారు. పార్టీ సిద్దాంతాలు, నాయకుని ఆదేశాలు పాటించాము కాబట్టే ఈ రోజున ఇక్కడికి రాగలిగానని చెప్పారు. దేశంలో ఏ నాయకుడైనా చేశాడా? అన్నది ఆలోచన చేయాలన్నారు.
మోదీ.. కన్వర్టెడ్ బీసీ
ప్రధాని మోదీ పుట్టుకతోబీసీ కాదని, చట్టపరంగా బీసీగా మారారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ పుట్టుకతో ఉన్నత కులానికి చెందిన వారని, 2001లో ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని బీసీలోకి చేర్చుకున్నారని చెప్పారు. మోదీ సర్టిఫికెట్లో బీసీ ఉండొచ్చునేమో కానీ.. ఆయన మసన్తత్వం మాత్రం బీసీలకు వ్యతిరేకమన్నారు. మోదీ నిజంగా బీసీ అయితే 2021లో జనగణన ఎందుకు చేయలేదని, ఆ లెక్కల్లో బీసీ కులాల లెక్క ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణననూ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలను నష్ట పరచాలని ఒక పక్కన మోదీ, ఇంకో పక్కన కేడీలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కులగణన లెక్కలు చూపి.. రాహుల్‌గాంధీ మోదీ మెడలు వంచుతారనే భయంతో ఈ లెక్కలను కోల్డ్ స్టోరేజీలో పెట్టించాలనే కుట్రలు బీజేపీ చేస్తున్నదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కులగణన లెక్కలను తప్పు పడితే నష్ట పోయేది బీసీలేనన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతంగా ఉందంటూ ప్రభుత్వం అధికారికంగా తేల్చిన నేపథ్యంలో రిజర్వేషన్ పెంపునకు చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్రంపైన ఉంటుందని వివరించారు.
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేయబోతున్నాం
ఎస్సీ వర్గీకరణ చట్టాన్నీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎస్సీ కులాలను తాము వర్గీకరిస్తే దాన్ని కూడా తప్పు పట్టాలని చూస్తున్నారన్నారు. ఏ పార్టీ కూడా చేయని సాహసోపేత కార్యక్రమాలను తమ మంత్రి వర్గం చేస్తోందని చెప్పారు.
కార్యకర్తలకు అనుకున్నంత న్యాయం చేయలేక పోయాం: మహే్‌షగౌడ్
కార్యకర్తల కృషితో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో న్యాయం జరగేలేదని చెప్పి వారు ప్రభుత్వంపై కొంత అలిగినట్లున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎంత చేసినా అనుకున్న స్థాయిలో సానుకూలత కనిపించడం లేదన్నారు. కులగణన వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వేలో వివరాలు ఇచ్చి.. జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేసీఆర్, కేటీఆర్‌లకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News