CM Revanth Reddy: ప్రాధాన్య జాబితాలో.. స్థానిక పెట్టుబడులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:28 AM
ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం.. అనేవి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. యూఎ్‌స, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీయులను కోరుతున్న మేము
పెట్టుబడుల రక్షణే కాదు.. లాభాలొచ్చేలా ప్రోత్సాహం
పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు
ఫ్యూచర్ సిటీ అంటే... రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా
జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్‌కు మెట్రో రైలు
పదేళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు
మేము వచ్చాక ఎల్బీనగర్-ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదన
శామీర్‌పేట, మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం
గత సర్కార్ కాళేశ్వరం కోసం 11.5% వడ్డీకి అప్పు
నేనొచ్చాక 26 వేల కోట్లను 7.5% వడ్డీకి మార్పించా
2లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్నా
ప్రాజెక్టుల అనుమతుల కోసమే పదే పదే ఢిల్లీకి
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం.. అనేవి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. యూఎ్‌స, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీయులను కోరుతున్న మేము.. ఇక్కడే ఉన్న పెట్టుబడిదారులను ఎందుకు వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మా మొదటి ప్రాధాన్యం మీకే ఉంటుంది’’ అని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, క్రెడాయ్ నిర్వాహకులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మారకూడదని, ఆ విధానాన్ని తాము పాటిస్తున్నందునే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని తెలిపారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత కూడా తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు ఊతమిస్తే నష్టపోయేది వ్యాపారులేనన్నారు. ప్రభుత్వం తరఫున అలాంటి వాటిని తొలగించడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులను అభినందించారు. హైటెక్స్‌లో శుక్రవారం క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని, ఇక్కడి సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న దృక్పథం తనకు లేదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని, కొన్ని సందర్భాల్లో వ్యాపారులు అడిగినవన్నీ అంగీకరించలేకపోవచ్చన్నారు. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘చార్మినార్‌ను కులీ కుతుబ్ షా నిర్మించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు. వారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం.. రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ పేరు గుర్తుకు వచ్చేలా నిర్మిస్తాం. వచ్చే వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకొనేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పం. నాకు ఆ చిత్తశుద్ధి, తపన ఉంది. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’’ అని క్రెడాయ్ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్‌లో ఉండేటోళ్లు మెట్రో ఎక్కుతారా?
‘‘కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు మెట్రో వచ్చింది .. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు.. అలా జరిగి ఉంటే ఈ రోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో హైటెక్‌సిటీ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు దాకా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. కానీ.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉన్న వారు ఎంత మంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడి నుంచి ఔటర్ మీదుగా వెళ్లినా అదే వేగంతో ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. మల్టీ యుటిలిటీ ట్రాన్స్‌పోర్ట్ అనేది జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల మీదుగా ఉండాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొత్తగా 100 ఎకరాల్లో నిర్మిస్తున్న హైకోర్టు సమీపం నుంచి శంషాబాద్, ఎయిర్‌పోర్టు దాకా మెట్రో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అలాగే, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కూకట్‌పల్లి తర్వాత మియాపూర్, లింగంపల్లి మీదుగా పటాన్‌చెరు వరకు, హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ మీదుగా కోకాపేట దాకా మెట్రో పొడిగించాలని అధికారులకు చెప్పా. అలాగే, ఇటు శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని భావిస్తున్నాం’’ అని వివరించారు. రెండు ఎలివేటెడ్ కారిడార్ల కోసం 200 ఎకరాలను ఇచ్చేలా రక్షణ శాఖను ఒప్పించామని గుర్తు చేశారు. శామీర్‌పేట, మేడ్చల్ ప్రాంతాలు.. వేగంగా విస్తరిస్తున్నాయని, మెరుగైన కనెక్టివిటీ ఉండేలా వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేను మాటి మాటికి ఢిల్లీ వెళ్తున్నానంటూ కొందరు మాట్లాడుతున్నారు. కానీ.. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగు రోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా’’ అని అన్నారు. మెట్రో, మూసీ రివర్‌ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టుల అనుమతుల కోసమే తరచుగా ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని వివరించారు.
రూపాయి ఖర్చు పెడితే 42 పైసలే వస్తోంది
‘‘కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట గత పాలకులు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. 12 ఏళ్లకు 11.5 శాతం వడ్డీకి రుణాలు తీసుకున్నారు. ఎంత వ్యాపారం చేసేటోళ్లైనా 11.5 శాతానికి అప్పులు తెస్తరా? నేను వచ్చిన 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల్లో అసలు, వడ్డీ కలిపి రూ.29వేల కోట్లు చెల్లించాను. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపాయి ఖర్చు పెడితే 42 పైసలే తిరిగి వస్తోంది. రాష్ట్రంపై అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రధాన మంత్రిని పలుమార్లు కలిశాను. ఇప్పటికే రూ.26వేల కోట్లను 7.5 శాతం వడ్డీకి 35 ఏళ్లకు రీస్ట్రక్చర్ చేయించా. మొత్తం రూ.2 లక్షల కోట్ల రుణాలను రీ స్ట్రక్చర్ చేయాలని ప్రధానిని కోరుతున్నా’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇదంతా తన కోసం చేస్తున్నది కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను తాపత్రయపడుతున్నానని తెలిపారు. మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలున్నాయని, తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డైనమిక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా క్రెడాయ్ సభ్యులను ప్రోత్సహిస్తామన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను పెద్ద పెద్ద ఇంగ్లీషు చదువులు చదువుకోకున్నా.. కామన్ సెన్స్ ఉంది. భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మాత్రమే’’ అని పేర్కొన్నారు.
3 రోజుల పాటు క్రెడాయ్ షో
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు ఎస్.జయదీప్ రెడ్డి తెలిపారు.ఈ ప్రదర్శనలో 70కి పైగా డెవలపర్లు, 300కు పైగా రెరా ఆమోదిత ప్రాజెక్టులు, అపార్టుమెంట్ కాంప్లెక్సులు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేసులు ఒకే వేదికపై ఉంటాయన్నారు. అగ్రశ్రేణి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సంబంధిత రంగాలకు చెందిన స్టాళ్లు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు (ఎలక్ట్) జి.రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ అగర్వాల్, కె.అనిల్ రెడ్డి, వై.రవిప్రసాద్, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు, డెవలపర్లు పాల్గొన్నారు.
సీఎం కృష్ణాష్టమి శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. కాగా, శిబు సోరెన్ సంస్మరణ సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఝార్ఖండ్ వెళ్లనున్నారు. ఉదయం 11.45గంటలకు బేగంపేట నుంచి బయలుదేరనున్న సీఎం.. తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రతిష్ఠాత్మక శౌర్య పతకానికి ఎంపికైన రాజునాయక్‌ను సీఎం రేవంత్ అభినందించారు. అలాగే, రాష్ట్ర పోలీసు శాఖకు 21 పతకాలు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News