Share News

CM Revanth Reddy 2034 Vision: నాడు హైటెక్‌ సిటీలా.. నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:43 AM

హైదరాబాద్‌కు ప్రపంచపటంలో ప్రత్యేక స్థానముందని, 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

CM Revanth Reddy 2034 Vision: నాడు హైటెక్‌ సిటీలా.. నేడు మూసీ ప్రక్షాళనను  వ్యతిరేకిస్తున్నారు

హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకునేవారంతా శత్రువులే

  • అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలే

  • మూసీ ప్రక్షాళనతో ఓల్డ్‌ సిటీకి పూర్వవైభవం

  • తెలంగాణ సమగ్రాభివృద్ధికి ‘2047 ప్రణాళిక’

  • గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు శంకుస్థాపనలో సీఎం

  • ఫైవ్‌స్టార్‌ హోటల్‌, ఎయిర్‌పోర్టు స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని వెల్లడి

  • అసెంబ్లీకి పోటీకి 21 ఏళ్ల వయస్సు చాలు

  • యువత చట్టసభల్లో ఉంటే దేశానికే మేలు

  • రాజీవ్‌ జయంతి కార్యక్రమంలో రేవంత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు ప్రపంచపటంలో ప్రత్యేక స్థానముందని, 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో హైటెక్‌ సిటీకి పునాదులు వేస్తే వ్యతిరేకించారని, నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులేనని, అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలేనని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌, గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. నాడు రాజీవ్‌ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. హైటెక్‌ సిటీ అభివృద్థికి ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పునాది వేసిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు హైదరాబాద్‌ వచ్చాయంటే.. నాటి ముఖ్యమంత్రులు చేసిన కృషి వల్లనేనని అన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదన్న సీఎం.. నాడు హైటెక్‌ సిటీ నిర్మాణాన్ని కొంతమంది అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీ లేదని న్యూయార్క్‌, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుతోందని పేర్కొన్నారు.


హైదరాబాద్‌ పాతబస్తీ అంటే ఓల్డ్‌ సిటీ కాదని ఒరిజినల్‌ సిటీ అని స్పష్టం చేసిన సీఎం.. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్‌ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. గోదావరి జలాలను తీసుకొచ్చి ఏడాది పొడవునా మూసీలో నీళ్లు ఉండేలా రివర్‌ ఫ్రంట్‌ అభివృద్థి చేస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజల కోసం హైదరాబాద్‌లో రాజీవ్‌ స్వగృహ భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నగర అభివృద్థితో పాటు నగర విస్తరణ జరగాలని, అందుకోసం తెలంగాణ సమగ్ర అభివృద్థికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సీఎం చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, అంతర్జాతీయ విమానాశ్రయాల స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యాలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 11 ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల నిర్మాణం పూర్తవ్వాలని వేదికపై ఉన్న మంత్రి పొంగులేటిని ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు.


30 కోట్లతో భవనం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్‌ రిజిస్ట్రేషన్‌ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను 11 ఇంటిగ్రేటెడ్‌ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. గచ్చిబౌలిలో 3 ఎకరాల్లో రూ.30 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో 50,000 చదరపు అడుగుల్లో భవనం నిర్మిస్తున్నామని వివరించారు. ఈ భవనంలో ఒక డీఐజీ, ఒక జిల్లా రిజిస్ట్రార్‌, ఆరుగురు సబ్‌ రిజిస్ట్రార్‌లు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌ సేవలను సరళీకృతం చేసేందుకు మంత్రి పొంగులేటి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 03:43 AM