CM Revanth Reddy: చంద్రబాబుతో పంచాయితీ కేసీఆర్ వల్లే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:47 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు పంచాయితీ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు.
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయనందునే..
ప్రజా ప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా?
స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లున్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం
మీరు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన గ్రామాల్లోనే పోటీ చేస్తారా?
నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్
అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
తొలుత జిల్లాకో పెట్రోల్ బంకు.. తర్వాత నియోజకవర్గానికొకటి..
మహిళా సంఘాలకు ఏడాదికి రెండు చీరలు: రేవంత్‌రెడ్డి
మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు పంచాయితీ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు. నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే... నిధులు కేసీఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి రూ.16 వేల కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసి రూ.35 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో శ్రీశైలం నుంచి తీసుకున్నారని, ఇప్పుడు అదే పాలమూరుకు శాపంగా మారిందని తెలిపారు. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును రూ.55 వేల కోట్లకు పెంచారని అన్నారు. పాలమూరుకు కేసీఆర్‌ను ఎంపీ చేయడం, గత ఎన్నికల్లో పాలమూరులో 13 సీట్లు గెలిపించడమే తాము చేసిన పాపమా? అని ప్రశ్నించారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మెడికల్, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలకు ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీని నడుపుతున్న కేసీఆర్ కళ్లకు పసిరికలు వచ్చాయని విమర్శించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 12 నెలల్లోనే చేసిన అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రూ.21 వేల కోట్ల రుణమాఫీ.. ఇవన్నీ కనిపించడం లేదన్నారు.
ఆ గ్రామాల్లో పోటీ చేసే దమ్ముందా?
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో ఉంచుతుందని, దమ్ముంటే బీఆర్‌ఎస్ కూడా డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే అభ్యర్థులను పోటీలో నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని తెలిపారు. కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్‌రూంల పేరుతో ఆశ చూపి మోసం చేసిందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసుకున్నామని, ఏటా ప్రతి ఇంటికీ రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పారు. అవసరమైతే నియోజకవర్గానికి 5వేల ఇళ్లు కేటాయిస్తామన్నారు. అభివృద్ధిపై చెబుతామంటే అసెంబ్లీకి రాని కేసీఆర్.. గట్టిగా కొడతానంటున్నారని, కానీ.. కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని సీఎం రేవంత్ హెచ్చరించారు. ‘గట్టిగా కొట్టాలంటే ఫుల్ లేదా హాఫ్ కొట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌ్‌సలలో డ్రగ్స్ పార్టీలు నడుపుతున్న కేటీఆర్‌ను, ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీసిన కవితను, కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ హరీశ్‌రావును గట్టిగా కొట్టాలని, అప్పుడైనా వారికి బుద్ధి వస్తుందని అన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజలకు కష్టాలు, వలసలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే పదేళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. 70 ఏళ్ల తర్వాత ఈ ప్రాంత వ్యక్తిగా తనకు సీఎం పదవి వస్తే.. చేసే ప్రతి పనికీ కేసీఆర్ అడ్డుపడుతూ పాలమూరుపై పగబట్టారని ఆరోపించారు. పరిశ్రమలు రాకుండా, ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు.
అప్పుడు తండ్రికి, తర్వాత కొడుక్కి సహకారం..
ఆనాడు వైఎ్‌సఆర్ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడును 4వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే హరీశ్‌రావు మంత్రిగా ఉండి రాజశేఖర్‌రెడ్డికి ఊడిగం చేశారని, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని ఆరోపించారు. తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక అధికారిక ప్రగతి భవన్‌కు పిలిచి రాయలసీమ లిఫ్టునకు పథకం రచించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు హారతి పట్టించి, ముచ్చుమర్రి నిర్మిస్తే ఒక్కరోజు అడ్డుకోకుండా వీరతిలకం దిద్ది పంచభక్షాలు పెట్టింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తొందర్లోనే రాయలసీమ లిఫ్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెలరోజుల్లోనే 300 టీఎంసీలు తరలించుకుపోయేందుకు పునాదులు వేసింది కేసీఆరేనన్నారు. దీనివల్ల పాలమూరు ఎడారిగా మారిందని, ఇక్కడి ప్రాజెక్టులను పడావు పెట్టి అన్యాయం చేశారని మండిపడ్డారు. లగచర్లలో పరిశ్రమలు పెడతామంటే కలెక్టర్‌ను చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. పదేళ్లు తనపై కక్షతో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టకుండా.. ఇప్పుడు తాము పనులు చేపడితే సర్వేను అడ్డుకుంటున్నారని, సొంత పేపర్‌లో, టీవీలో రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో పెట్టి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు మింగారని ఆరోపించారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కుప్పకూలిన దిక్కుమాలిన నిర్మాణం అదేనని అన్నారు.
పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..
కేసీఆర్ పదేళ్ల పాలనపై, నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనపై, ప్రజా ప్రభుత్వ 14 నెలల పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. నల్లధనం తెస్తానని, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని, కానీ.. ఆయన దోస్తులు బ్యాంకులను రూ.16 లక్షల కోట్లకు కొల్లగొట్టి విదేశాలకు వెళ్లారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ప్రకారం తెలంగాణలోనే కోటి ఉద్యోగాలు రావాలని, మరి ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతు వ్యతిరేక నల్లచట్టాలు తెస్తే 16 నెలలు రైతులు ఢిల్లీని దిగ్బంధించడంతో జాతికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. వందేళ్ల నుంచి కులగణన జరగలేదని, తాను సీఎం అయ్యాక కులగణన చేసి ఎవరి వాటా ఎంతో తేల్చామని, 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పీటముడిని పరిష్కరించామని చెప్పారు. కాగా, మెడికల్ కళాశాలకు దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారికి సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతోందని, చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ నాలుగేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రె్‌సదేనని అన్నారు. కులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి కులగణన చేశామన్నారు.
ఎల్లమ్మను దర్శించుకున్న సీఎం
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని పోలెపల్లిలో ఎల్లమ్మ తల్లిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శుక్రవారం నారాయణపేట పర్యటనకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకొని, పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, మల్టీ జోన్-2 ఐజీపీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తదితరులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, శ్రీహరి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పన కోసం బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యలో శనివారం పార్టీ బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు ప్రజాభవన్‌లో జరిగే సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్‌ను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లులకు ఆమోదం లభించాక 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం జరగాల్సిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది.
మహిళలతోనే ఆరోగ్య సమాజం
మహిళలతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన అనంతరం మహిళలతో ముఖాముఖిలో సీఎం మాట్లాడారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను పెట్టుకున్నామన్నారు. త్వరలో మొదటి దశలో జిల్లాకో పెట్రోల్ బంకు, తర్వాత నియోజకవర్గానికి ఒకటి నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పావలా వడ్డీ, జీరో వడ్డీ రుణాలు, వ్యాపార నైపుణ్యాలు పెంపొందిస్తున్నామని చెప్పారు. గతంలో పెద్ద సంస్థలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేవని, ఇప్పుడు మహిళా సంఘాలు 600 బస్సులను ఆర్టీసీలో నడిపిస్తున్నాయని వెల్లడించారు. మహిళా సంఘాలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు రూ.వెయ్యి కోట్లతో అందిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు నిధులు ఇస్తానని, నిర్వహణ చూసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
Read Latest Telangana News and Telugu News