Young Players: యువ సంచలనాలు.. ప్రపంచానికి పరిచయం చేసిన 2025
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:28 PM
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రీడా చరిత్రలో 2025 సంవత్సరం ఓ మైలురాయిగా నిలిచింది. సీనియర్లు తమ స్థాయిని చాటుతూనే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం భయాన్ని తెలియని యువతరమే ప్రపంచ క్రీడా వేదికలను శాసించింది. క్రికెట్ పిచ్ నుంచి చెస్ బోర్డు వరకు.. భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై గర్వంగా ఎగరవేశారు. 2025లో భారత యువ క్రీడాకారులు సాధించిన చారిత్రక విజయాలపై ఓ లుక్కేద్దాం..
వండర్ వేవ్.. వైభవ్ సూర్యవంశీ
పాలబుగ్గల పసితనమే పోనీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi ).. క్రికెట్ ప్రపంచాన్ని గజగజలాడించాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్, గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసు సెంచరీ హీరోగా నిలిచాడు. అండర్-19 వన్డేల్లో 52 బంతుల్లో 143 పరుగులతో వేగవంతమైన సెంచరీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 బంతుల్లో 108 పరుగులు.. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో 33 బంతుల్లో సెంచరీ.. ఇలా రికార్డుల వరద పారించాడు. ఈ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించారు.
‘యువరాణి’.. దివ్య దేశ్‌ముఖ్

64 గడుల ఆటలో భారత సత్తాను చాటుతూ 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh) ఫిడే మహిళల ప్రపంచకప్–2025ను గెలుచుకుంది. జార్జియాలో జరిగిన ఆల్ ఇండియన్ ఫైనల్లో కొనేరు హంపిని ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ విజయంతో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన నాలుగో భారత మహిళగా చరిత్రకెక్కింది.
స్క్వాష్‌లో.. అనహత్ సింగ్
17 ఏళ్ల అనహత్ సింగ్(Anahat Singh) స్క్వాష్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియన్ ఓపెన్, ఇండియన్ టూర్ ఫైనల్స్‌లో అనుభవజ్ఞురాలైన జోష్నా చినప్పాను మూడు సార్లు ఓడించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించడంలో కీలక పాత్ర పోషించింది.
పారా ఆర్చరీలో స్వర్ణ చరిత్ర.. షీతల్ దేవి

చేతులు లేకుండానే బాణాన్ని ఎక్కుపెట్టే అసాధారణ ప్రతిభ గల షీతల్ దేవి(Sheetal Devi), గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ప్రపంచాన్ని కదిలించింది. టర్కీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ ఒజ్నూర్ కూర్ గిర్డీపై 146–143తో విజయం సాధించింది. వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీమ్‌లో రజతం, మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యం కూడా గెలుచుకుంది.
జావెలిన్‌లో కొత్త ఆశ.. సచిన్ యాదవ్

టోక్యో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల సచిన్ యాదవ్(Sachin Yadav) 86.27 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచాడు. పతకం దక్కకపోయినా.. ప్రపంచ స్థాయి పోటీల్లో భారత్ నిలకడగా ఉంటుందన్న నమ్మకాన్ని పెంచాడు.
షూటింగ్ సంచలనం.. సమ్రాట్ రాణా

కైరోలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సమ్రాట్ రాణా(Samrat Rana) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ పిస్టల్ ఈవెంట్‌లో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
వరల్డ్ కప్ ఫైనల్‌లో షెఫాలి హవా

మహిళల వన్డే వరల్డ్‌కప్–2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షఫాలి వర్మ(Shefali Verma) 78 బంతుల్లో 87 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అర్ధశతకం చేసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి భారత్‌కు తొలి మహిళల వరల్డ్ కప్‌ను అందించింది.
ట్రాక్‌పై మెరుపు.. అనిమేశ్ కుజూర్
భారత స్ప్రింటింగ్‌కు కొత్త ఊపునిచ్చాడు అనిమేశ్ కుజూర్(Animesh Kujur). గ్రీస్‌లో జరిగిన డ్రోమియా ఇంటర్నేషనల్ మీట్‌లో 100 మీటర్లను 10.18 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు బద్దలుకొట్టాడు. 200 మీటర్లలోనూ రికార్డు నెలకొల్పి, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారత స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!