Damien Martyn: కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:35 PM
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమయంగా ఉంది. కాగా మార్టిన్ ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 ఫైనల్‌లో భారత్‌పై విరిగిన వేలితో అజేయంగా 88 పరుగులు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్(54) కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రకటించారు. డిసెంబర్ 26న అనారోగ్యంతో బ్రిస్బేన్‌లోని ఆసుపత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. మార్టిన్ మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు. ఇది మెదడు వాపుకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు క్రికెటర్లు స్పందిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మార్టిన్(Damien Martyn) ఇలా అవ్వడంపై బాధను వ్యక్తం చేస్తున్నారు.
డార్విన్‌లో పుట్టిన మార్టిన్.. ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు ఆడి 4,406 పరుగులు చేశాడు. 21 ఏళ్ల వయసులో 1992-93లో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో డీన్ జోన్స్ స్థానంలో మార్టిన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 23 ఏళ్లకు వెస్టర్న్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అతని 13 టెస్ట్ సెంచరీలలో 2005లో న్యూజిలాండ్‌పై సాధించిన 165 పరుగులు అత్యధికం. మార్టిన్ 2006-07 యాషెస్ సిరీస్‌లో అడిలైడ్ ఓవల్‌లో తన చివరి టెస్ట్ ఆడి, అనంతరం కామెంటరీ రంగంలోకి మారారు. 208 వన్డేల్లో 5,346 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 ఫైనల్‌లో భారత్‌పై విరిగిన వేలితో అజేయంగా 88 పరుగులు చేశాడు. అంతేకాకుండా, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో కూడా మార్టిన్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!