T20 WC 2026: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:24 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది. అతడు డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకు లంక జట్టుకు కన్సల్టెంట్ పేస్-బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది. అతడు డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకు లంక జట్టుకు కన్సల్టెంట్ పేస్-బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంతో అనుభవం ఉన్న మలింగ(Lasith Malinga) సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది.
డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎలా ఉండాలి.. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు ఎలా కళ్లెం వేయాలి? అనే తదితర అంశాల్లో మలింగ తమ పేసర్లకు మెలకువలు నేర్పిస్తాడని ఒక ప్రకటనలో తెలిపింది. మలింగ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు బౌలింగ్ కోచ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. 2014లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక.. గత మూడు ఎడిషన్లలో నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది. రానున్న ప్రపంచ కప్‌లో లంక గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, జింబాబ్వేతో తలపడనుంది.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!