Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ పునరాగమనం మరింత ఆలస్యం!
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:48 AM
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి అతడికి ఇంకా అనుమతి లభించలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచులో గాయపడిన శ్రేయస్.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. అయితే టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ జట్టులోకి అయ్యర్(Shreyas Iyer)ను తీసుకోనున్నారనే వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ చెక్ పడినట్లు అయింది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి ఫీల్డింగ్ చేయడానికి అవసరమైన శక్తిని ఇంకా తిరిగి పొందలేదని సమాచారం.
ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను పట్టుకునే ప్రయత్నంలో డైవ్ చేయగా శ్రేయస్‌కు ప్లీహం (స్ప్లీన్) తీవ్రంగా గాయపడింది. స్కాన్లలో అంతర్గత రక్తస్రావం గుర్తించడంతో అతడిని వెంటనే సిడ్నీలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. రక్తస్రావాన్ని నియంత్రించేందుకు చిన్న శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అనంతరం భారత జట్టు వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న శ్రేయస్ భారత్‌కు తిరిగొచ్చాడు.
బరువు తగ్గి..
ఇక గాయం కారణంగా శ్రేయస్ సుమారు 6 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కండరాల బలం తగ్గడంతో ఫిట్‌నెస్‌పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. రికవరీ ప్రణాళిక ప్రకారం జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ, అది అతడి శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ(BCCI) స్పష్టం చేసింది.
‘శ్రేయస్ ఇప్పటికే స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు మంచి స్థితిలోనే ఉన్నాడు. అయితే 50 ఓవర్ల మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే సామర్థ్యం ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. అతడి పరిస్థితిని బట్టి విజయ్ హజారే ట్రోఫీలో ఆడించాలా వద్దా అన్నది నిర్ణయిస్తాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సర్జరీ తర్వాత పూర్తి స్థాయి మ్యాచ్ ఒత్తిడిని తట్టుకునే స్థాయికి చేరుకునే వరకు శ్రేయస్ పునరాగమనం వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!