Ind Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:23 AM
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో షమీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. చాలాకాలంగా జట్టులో అందుబాటులో లేడు. చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కనిపించాడు. మార్చి 9న న్యూజిలాండ్‌తో టీమిండియాకు జరిగిన ఫైనల్ మ్యాచులో బౌలింగ్ చేశాడు. అనంతరం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తుది జట్టుకు షమీ(Mohammed Shami) దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏ టోర్నీలో.. ఏ ఇతర ఫార్మట్‌లోనూ అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే దేశవాళీల్లో మాత్రం రాణిస్తున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇది జనవరి 11 నుంచి స్వదేశంలోనే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు షమీని సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘మహ్మద్ షమీ ఎంపిక గురించి చర్చ నడుస్తుంది. అతడి నైపుణ్యం మీద ఎలాంటి అనుమానమూ లేదు. కానీ అతడి ఫిట్‌నెస్ గురించే ఆందోళన అంతా. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ఒకవేళ అతడు ఎంపికైనా ఆశర్యపోవాల్సిన పని లేదు. అలాగే వన్డే ప్రపంచ కప్ 2027లో కూడా అతడు ఆడే అవకాశాలు లేకపోలేదు’ అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
కెరీర్ ఇలా..
వన్డే ప్రపంచ కప్ 2023లో మహ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్ తర్వాత అతడు టెస్టు మ్యాచులు కూడా ఆడటం లేదు. అలాగే షమీ టీ20ల్లో చివరిసారిగా ఫిబ్రవరిలో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో కనిపించాడు. బీసీసీఐ(BCCI) ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులోనూ షమీ చోటు దక్కించుకోలేకపోయాడు
ప్రస్తుతం జరగుతున్న దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో షమీ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు మూడు మ్యాచుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున ఆడుతూ.. ఏడు మ్యాచుల్లో 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతి ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహ్మద్ షమీని ఎంపిక చేసే అవకాశముందని సమాచారం.
ఇవీ చదవండి:
Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!