Guguloth Soumya: దుమ్మురేపిన తెలంగాణ యువతి సౌమ్య.. ఈస్ట్ బెంగాల్ సంచలన విజయం
ABN , Publish Date - Dec 31 , 2025 | 08:42 AM
ఇండియన్ ఉమెన్ లీగ్ 2025లో భాగంగా మంగళవారంనాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్, సెసా ఫుట్‌బాల్ అకాడమీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తెలంగాణకు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ సౌమ్య అదరగొట్టింది. దీంతో 9-0 తేడాతో ఈస్ట్ బెంగాల్ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్య(Guguloth Soumya).. ఇండియన్ ఉమెన్ లీగ్(IWL)లో అదరగొట్టింది. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్య.. ఐడబ్ల్యూఎల్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున ఆడుతోంది. సెసా ఫుట్‌బాల్ అకాడమీ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో.. ఈస్ట్ బెంగాల్ జట్టు 9-0తో ఘన విజయం ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇండియన్ ఉమెన్ లీగ్(Indian Women League)లో భాగంగా మంగళవారం నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్(East Bengal Women Team), సెసా ఫుట్‌బాల్ అకాడమీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచీ చివరి వరకు సౌమ్య అదరగొట్టింది. ఆమె 6వ, 54వ, 86వ నిమిషాల్లో మూడు గోల్స్ చేయగా.. ఫాజిలా ఇక్వాపుట్ 9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో నాలుగు గోల్స్ చేసి సత్తాచాటింది. 18వ నిమిషంలో సులాజన రౌల్, 40వ నిమిషంలో రెస్టీ నాన్‌జిరి చెరో గోల్ చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈస్ట్ బెంగాల్ జట్టు తమ స్థాయికి తగ్గట్టు ఆడుతూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకుని ప్రత్యర్థి పోస్ట్‌పై దాడి చేయగా.. ప్రత్యర్థి గోల్‌కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే.. బాక్స్ సమీపంలో బంతిని అందుకున్న గుగులోత్ సౌమ్య(Guguloth Soumya) చక్కటి గోల్ కొట్టింది. మరో మూడు నిమిషాల షాజిలా మరో గోల్‌తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది.
స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ రావడంతో అక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్(East Bengal Women Team) పదే పదే గోల్స్ చేసేందుకు ప్రయత్నించింది. వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టిన ఫాజిలా హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. మొదటి అర్ధభాగం మ్యాచ్ ముగిసేసరికి ఈస్ట్ బెంగాల్ జట్టు 6–0తో ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు, ఫాజిలా మరో గోల్ చేశారు. దీంతో ఈస్ట్ బెంగాల్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఈస్ట్‌బెంగాల్ జట్టు తరఫున ఆల్‌టైమ్ టాప్ గోల్ స్కోరర్(11)గా సౌమ్య నిలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్ బెంగాల్ 9 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్‌బాల్ అకాడమీ 4 మ్యాచుల్లో 3 విజయాలు, ఒక డ్రాతో 10 పాయింట్లతో టాప్‌లో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం నీతా ఫుట్‌బాల్ అకాడమీతో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడనుంది.
ఇవీ చదవండి:
Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!