Womens World Cup 2025: ఉమెన్స్ వరల్డ్ కప్ 2025.. టీమిండియాకు గోల్డెన్ ఛాన్స్!
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:17 PM
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.
మనం ఎన్ని తప్పులు చేసినా.. దేవుడు ఏదో ఒక రూపంలో మరో అవకాశం ఇస్తాడని చాలా మంది అంటుంటారు. అది ఏ రంగమైనా సరే, ఏ విషయంలో అయినా సరే. అలా వచ్చే లక్కీ ఛాన్స్ ను సరిగ్గా వినియోగించుకుంటే.. విజేతలుగా నిలవచ్చు. అలానే వరుణుడు భారత్ కు ఓ మంచి అవకాశం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే.. సెమీస్ విషయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్ కు వాన దేవుడు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారనే చెప్పొచ్చు. మరి.. ఈ వర్షం, లక్కీ ఛాన్స్ ఏంటి అనే కదా మీ సందేహం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో(Womens World Cup 2025) శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆర్ ప్రేమ దాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక(Srilanka) ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అయితే న్యూజిలాండ్(New Zealand) టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్ దిగక ముందే వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ తీసుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు(Team India) లాభాన్ని చేకూర్చిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. నాలుగు మ్యాచ్‌లలో రెండు పాయింట్లతో శ్రీలంక ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ శ్రీలంకకు పెద్ద నష్టం జరగనప్పటికీ.. సెమీస్(Semi Final) అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావించిన కివీస్‌కు మాత్రం ఈ మ్యాచ్ రద్దు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే రెండు పరాజయాలను చవిచూసింది. తాజాగా మ్యాచ్ రద్దుతో సెమీ-ఫైనల్ రేసు మరింత కష్టమైంది. మరోవైపు మ్యాచ్ రద్దు కావడం భారత జట్టుకు మేలు చేసింది.
భారత్ ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిస్తే.. గరిష్టంగా 10 పాయింట్ల వరకు చేరుకోగలదు. అయితే న్యూజిలాండ్(New Zealand) జట్టు మిగిలిన మ్యాచులు గెలిచి 9 పాయింట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 23న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్(India Semi Final Chance) ఆశలను సులభం చేసుకునేందుకు వాన రూపంలో ఈ మంచి ఛాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. అయితే ఈ అవకాశాన్ని టీమిండియా ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందనేది తెలియాలి అంటే మరికొన్ని రోజుల ఆగాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Kareena Kapoor comments: మా వాడికి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్
Shivam Dube Injured: ఆసీస్ టూర్ వేళ టీమిండియాకు బిగ్ షాక్!