China WTO Complaint: భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ WTOకి చైనా ఫిర్యాదు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:04 PM
భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు తమ కొంప ముంచుతున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థకు చైనా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమ బాధను డబ్ల్యూటీవోకి మెురపెట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ దాయాది దేశం చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి మొరపెట్టుకుంది. భారతదేశంలో EV(ఎలక్ట్రానిక్ వెహికల్స్), ఇంకా బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు మా కొంప ముంచుతున్నాయని డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంకా బ్యాటరీ ఉత్పత్తికి సంబంధించిన భారతదేశపు సబ్సిడీ కార్యక్రమాలను సవాలు చేస్తూ.. చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ(MOFCOM) ప్రకారం, భారతదేశం చేస్తున్న సబ్సిడీ చర్యలు, దిగుమతి ప్రత్యామ్నాయ సబ్సిడీలకు సమానమని ఫిర్యాదులో ఆరోపించింది. ఇవి WTO నిబంధనల ప్రకారం నిషేధించబడ్డాయని పేర్కొంది. ఈ సబ్సిడీలు వేగంగా పెరుగుతున్న విద్యుత్ వాహనాలు, బ్యాటరీ రంగాలలో భారతీయ పరిశ్రమలకు అన్యాయమైన పోటీ ప్రయోజనాన్ని ఇస్తాయని కూడా చైనా ఆరోపించింది.
అంతేకాదు, ఈ అంశంపై WTO దగ్గర సంప్రదింపులకు రావాలని భారత్‌కు చెప్పాలని చైనా కోరింది. భారతదేశం అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతులను వివరించి సరిదిద్దాలని ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా అభ్యర్థించింది. భారతదేశ విధానాల వల్ల ప్రభావితమైన తమ దేశీయ పరిశ్రమల హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చైనా ప్రభుత్వం తన ఫిర్యాదులో కోరింది.
భారత్ తమ పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తే, ఈ చైనా ఎవరు.. WTO ఎవరు?
భారత ప్రభుత్వం ఈవీలు, బ్యాటరీ ఉత్పత్తులపై తమ కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంటే చైనాకు, WTOకి ఏం సంబంధం? అసలు, ఈ విషయంలో భారత్‌కు జరుగుతున్న మేలు ఏమిటి, చైనాకు జరుగుతున్న నష్టం ఏమిటి? అనే ప్రశ్న అందరి మదిలో మెదిలే అవకాశం ఉంది. అయితే, ఒక విషయం ఏంటంటే.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనేది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నిర్వహించే సంస్థ. దాని సభ్య దేశాలు (భారత్, చైనా సహా) సమానమైన, న్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించాలని ఇది నిర్దేశిస్తుంది. ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ సబ్సిడీలు.. WTO ఒప్పందం ప్రకారం (Agreement on Subsidies and Countervailing Measures), స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దిగుమతులను నిరోధించే సబ్సిడీలు నిషేధించబడ్డాయి. చైనా ఆరోపణ ప్రకారం, భారత సబ్సిడీలు దేశీయ EV కంపెనీలకు అన్యాయమైన ప్రయోజనం ఇస్తూ, చైనా ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను అడ్డుకుంటున్నాయంటోంది. భారత్ EVలపై అందిస్తున్న సబ్సిడీలు (PLI స్కీమ్, GST తగ్గింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు వంటివి) WTO నిబంధనలను ఉల్లంఘిస్తాయని చైనా ఆరోపిస్తోంది.
కాగా, చైనా ప్రపంచంలో అతిపెద్ద EV, బ్యాటరీ ఉత్పత్తిదారు. 2023లో $42 బిలియన్ విలువైన EVలను చైనా ఎగుమతి చేసింది. భారత్‌లో సబ్సిడీలు, అధిక ఇంపోర్ట్ డ్యూటీలు (70-100%)వల్ల చైనా EV కంపెనీలు (BYD, SAIC వంటివి) భారత మార్కెట్‌లోకి వచ్చి పోటీ పడకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా చైనా మార్కెట్ షేర్ నష్టాన్ని ఎదుర్కొంటోంది. భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్లలో ఒకటి. పైగా ఇప్పుడు భారత్ లో EV డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా దేశీయ కంపెనీలైన (టాటా, మహీంద్రా) దేశీయ, ప్రపంచ మార్కెట్లో తమ ఆధిక్యత చూపిస్తున్నాయి. తద్వారా చైనా ఎగుమతులకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో డబ్ల్యూటీవోని చైనా ఆశ్రయించింది.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి