Sunil Gavaskar: 100 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ కోహ్లీకి ఉంది: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Dec 07 , 2025 | 07:30 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన విరాట్.. మూడో వన్డేలో టార్గెట్ పెద్దగా లేకపోవడంతో హ్యాట్రిక్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. విశాఖపట్నంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మూడు వన్డేల్లో కలిపి302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.
మూడో వన్డే ముగిసిన అనంతరం ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన గావస్కర్.. కోహ్లీ(Virat Kohli) ఫామ్ గురించి మాట్లాడాడు. ‘ 100 సెంచరీలు కోహ్లీకి ఎందుకు సాధ్యం కాదు?. అతడు ఇంకా కనీసం మూడు సంవత్సరాలు ఆడినా వందకు చేరేందుకు 16 సెంచరీలు మాత్రమే అవసరం. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేశాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ మరో రెండు శతకాలు చేస్తే అప్పుడు విరాట్ సెంచరీల సంఖ్య 86కు చేరుతుంది. ప్రపంచ కప్(World Cup 2027) ముగిసేనాటికి టీమిండియా దాదాపు 35 వన్డే మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. కోహ్లీ వీటన్నింటిలో ఆడి.. ఇదే ఫామ్ కొనసాగిస్తే శతకాల శతకం చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం విరాట్ తన బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు నెల రోజుల విరామం దొరికింది. ఈ గ్యాప్‌లో అతని ఫామ్ ఏమవుతుందో చూడాలి. ఈ బ్రేక్ లేకపోతే కివీస్‌తో సిరీస్‌లో కచ్చితంగా రెండు లేదా మూడు సెంచరీలు చేసేవాడని నేను భావిస్తున్నాను’ అని గావస్కర్(Sunil Gavaskar) తెలిపాడు. జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అలానే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్(Sachin) మాత్రమే 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ(Virat Kohli) ఖాతాలో 84 శతకాలున్నాయి. 100 సెంచరీలకు మరో 16 శతకాల దూరంలో కోహ్లీ ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!