BJP Leaders Slam Revanth Govt: రైజింగ్ తెలంగాణ కాదు.. అవినీతి తెలంగాణ: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:48 PM
కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 07: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో.. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన.. వంచన పాలన తప్పితే మరొకటి కాదని మండిపడ్డారు.
రేవంత్ పాలన 420 అని.. ఆయనది ఫేక్ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలతో రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను వంచించారని విమర్శించారు. ఈ హామీలపై తెలంగాణ ప్రజలతోపాటు బీజేపీ సైతం ప్రశ్నిస్తోందని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తున్న సమాజానికి సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధితోపాటు నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పాలన్నారు. మోసం చేయడం.. ప్రజల దృష్టిని మళ్లించడం సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని ఎంపీ లక్ష్మణ్ అభివర్ణించారు. రైజింగ్ తెలంగాణ అంటే ఏమిటో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
రైజింగ్ తెలంగాణ.. డ్రగ్స్ కల్చర్‌గా మారిపోయిందని, రైజింగ్ తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందంటూ ఆరోపించారు. పట్టపగలే పోలీసులను కాల్చి పడేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. పోలీసులకే దిక్కు లేదు, లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్, డ్రగ్స్, ఆన్ లైన్ గేమ్, ల్యాండ్ మాఫియా కల్చర్లలో రాష్ట్రం కూరుకుపోయిందన్నారు. రైజింగ్ తెలంగాణ కాదు ఇది అవినీతి తెలంగాణ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోలేని భయాందోళనలో కంపెనీలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ మహనగరం కాంక్రీట్ జంగల్‌గా మారిపోయిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు పాపాలుగా మారి ప్రజలను పీడిస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో అంతకన్నా రెట్టింపు అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అప్పులు పుట్టడం లేదు, చెప్పులు ఎత్తుకు పోయేలా చూస్తున్నారని చెప్పిన రేవంత్.. నేడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటే నమ్ముతారా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ స్కామ్ ల కోసమే తప్ప మరొకటి కాదన్నారు. రైజింగ్ పేరుతో హైదరాబాద్‌ను ఏం చేయబోతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో భూములను కాజేస్తామంటే సహించేది లేదని.. అడుగడుగున అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని.. లేకపోతే రాష్ట్రం లూటీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన 420 హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పత్త లేరన్నారు. జాతీయ కులగణన ద్వారానే దేశంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం.. వేటాడతాం.. విడిచి పెట్టేది లేదంటూ రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ సర్కార్‌ను అడుగడుగునా నిలదీసేందుకు సంసిద్ధం కావాలని ప్రజలకు లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ త్వరలో ఇంటికే: తెలంగాణ బీజేపీ చీఫ్
కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు ఇంత వరకు ఎందుకు విడుదల చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మాఫియా చేతిలో ల్యాండ్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు మిగిలేది శూన్యమన్నారు.
మత రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడు కోట్ల మంది దేవుళ్లు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురే దేవుళ్లని.. వారే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంటూ వ్యంగ్యంగా వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. దేశ ద్రోహులను పోషిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని విమర్శించారు.
కేంద్రం ఏమి ఇచ్చిందంటూ అబద్ధాలు చెప్పుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీజేపీ చీఫ్. దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తుందని గుర్తు చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన ఇంటి కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ మహా ధర్నా మహా ధర్మ యుద్ధంగా మారుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వచ్ఛ లేదన్నారు. రాబోయే మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిందని.. ప్రస్తుతం ఆ పార్టీ వీఆర్ఎస్ తీసుకుందని ఎద్దేవా చేశారు.
పార్టీ అదేశిస్తే అమరణ దీక్ష: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో ఎక్కడ లంకెబిందెలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెతుకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. అంతేకానీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేయడం లేదన్నారు. పరిశ్రమలు మూసేసిన మీరు.. ఎక్కడ ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలను తరలించి రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. లంకెబిందెల కోసమే పరిశ్రమలు తరలిస్తున్నారని విమర్శించారు.
హిల్ట్ భూముల తరలింపునకు కేంద్ర పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే.... హిల్ట్ భూముల వాస్తవాలను బయటపెడుతానని స్పష్టం చేశారు. ఈ భూముల విషయంలో పార్టీ ఆదేశిస్తే ఆమరణ దీక్ష చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
స్కీమ్‌ల్లో స్కామ్ లు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ పార్టీ అర చేతిలో స్వర్గం చూపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కాంగ్రెస్ స్కీమ్‌లో స్కామ్ లు తప్ప మరొకటి లేదని ఎద్దేవా చేశారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రేవంత్ పాలన.. అవినీతి, అరాచకం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
రేవంత్ రెడ్డి పాలన అబద్ధాలు, అవినీతి, అరాచకమని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అభివర్ణించారు. సిరి గల తెలంగాణను ఒకరు తాకట్టు పెడితే... ప్రస్తుత సీఎం అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ పోరాట పంథా మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టు మ్యాచ్‌లు కాదు ప్రస్తుతం ఉన్న పద్ధతికి అనుగుణంగా మారాలని అభిప్రాయపడ్డారు. అంటే 20-20 స్టైల్‌లోకి రావాలన్నారు. 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని.. ఈ పోరాటాలతో కార్యకర్తలు అలసిపోయారన్నారు. ఇంకా ఎన్ని ఏళ్లు పోరాటం చేయాలంటూ ప్రశ్నించారు. ఎన్ని మ్యాచ్‌లు ఆడామనేది కాదు.. మ్యాచ్ గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యమని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి
For More TG News And Telugu News