Share News

Vijay Hazare Trophy 2025: దేశవాళీ టోర్నీలో కోహ్లీ, రోహిత్.. మ్యాచ్‌లు ఎలా చూడాలంటే?

ABN , Publish Date - Dec 24 , 2025 | 07:51 AM

15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు.

Vijay Hazare Trophy 2025: దేశవాళీ టోర్నీలో కోహ్లీ, రోహిత్.. మ్యాచ్‌లు ఎలా చూడాలంటే?
Vijay Hazare Trophy 2025

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2025)కి రంగం సిద్దమైంది. బుధవారం నుంచి ఈ టోర్నీకి ప్రారంభం కానుంది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ టోర్నీ మ్యాచులను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. విజయ్ హజారే టోర్నీ మ్యాచులను ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం...


విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో హాట్ స్టార్‌లో ప్రసారం కానున్నాయి. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లకు ప్రత్యక్ష ప్రసారం లేదు. కేవలం అహ్మదాబాద్, రాజ్‌కోట్ వేదికగా జరిగే మ్యాచ్‌లు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీంతో కోహ్లీ, రోహిత్( Rohit Sharma Vijay Hazare Trophy) మ్యాచ్‌లను చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. 38 జట్లు ఉండటం.. ఒకే రోజు 19 మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభం కానుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నాకౌట్ మ్యాచ్‌లు మాత్రం ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.


ఇక ఈ దేశవాళీ టోర్నీలో కోహ్లీ, రోహిత్ శర్మతో మరికొందరు ప్లేయర్లు వివిధ జట్ల తరఫున ఆడనున్నారు. స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ (ఢిల్లీ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), మహమ్మద్ షమీ (బెంగాల్), హార్దిక్ పాండ్యా (బరోడా) వంటి స్టార్ ఆటగాళ్లు కూడా తమ రాష్ట్ర జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు. బీసీసీఐ తీసుకొచ్చిన నయా రూల్‌ కారణంగా ఈ స్టార్ ప్లేయర్లు దేశవాళీ టోర్నీలో ఆడుతున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ కారణంగా భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ టోర్నీకి క్రేజ్‌ నెలకొంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. జనవరి 12 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనుండగా.. జనవరి 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 24 , 2025 | 07:52 AM