Share News

India Women Cricket: అమ్మాయిలు అలవోకగా..

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:24 AM

షఫాలీ వర్మ (34 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69 నాటౌట్‌) అదిరే అర్ధ శతకంతోపాటు స్పిన్నర్లు రాణించడంతో.. భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది...

India Women Cricket: అమ్మాయిలు అలవోకగా..

అదరగొట్టిన షఫాలీ

  • శ్రీ చరణికి రెండు వికెట్లు

  • రెండో టీ20లో లంక చిత్తు

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): షఫాలీ వర్మ (34 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69 నాటౌట్‌) అదిరే అర్ధ శతకంతోపాటు స్పిన్నర్లు రాణించడంతో.. భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. హర్షిత సమరవిక్రమ (33), చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) ఫర్వాలేదనిపించారు. శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. స్నేహ్‌ రాణా (1/11) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఛేదనలో భారత్‌ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. జెమీమా రోడ్రిగ్స్‌ (26) రాణించింది. కవిష, మాల్కి మదార, కవింది తలో వికెట్‌ పడగొట్టారు. జ్వరంతో బాధపడుతున్న దీప్తి శర్మ స్థానంలో స్నేహ్‌ రాణా జట్టులోకి వచ్చింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా షఫాలీ నిలిచింది.

బాదుడే.. బాదుడు: డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ తుదికంటా క్రీజులో నిలవడంతో.. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (14), షఫాలీ తొలి వికెట్‌కు 29 పరుగులతో దూకుడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, నాలుగో ఓవర్‌లో కవిష బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో మంధాన అవుటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలసి షఫాలీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో పవర్‌ప్లేను భారత్‌ 68/1తో ముగించింది. అయితే, 8వ ఓవర్‌లో జెమీమాను కవింది క్యాచవుట్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి జట్టు విజయానికి ఇంకా 42 పరుగులు కావాలి. ఈ దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (10) అండతో షఫాలీ.. మరో 49 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది.


22-Sports.jpg

కట్టడి చేసిన స్పిన్నర్లు: స్నేహ్‌ రాణాతోపాటు యువ స్పిన్నర్లు చరణి, వైష్ణవి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. లంక ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు క్రాంతి ఆరంభంలోనే షాకిచ్చింది. ఓపెనర్‌ విష్‌మి గుణరత్నె (1)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చింది. అయితే, కెప్టెన్‌ చమరి, హాసిని రెండో వికెట్‌కు 36 రన్స్‌తో ఆదుకొనే ప్రయత్నం చేశారు. చమరిని రాణా అవుట్‌ చేయగా.. పెరీరాతో జత కలసి హర్షిత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించింది. కానీ, హాసినిని అవుట్‌ చేసిన చరణి.. మూడో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసింది. హర్షితను రిచా రనౌట్‌ చేయడంతో.. లంక తడబడింది. 24 పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోయింది.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 20 ఓవర్లలో 128/9 (హర్షిత 33, చమరి 31; శ్రీచరణి 2/23, వైష్ణవి 2/32).

భారత్‌: 11.5 ఓవర్లలో 129/3 (షఫాలీ 69 నాటౌట్‌, జెమీమా 26; కవిష 1/15, మదార 1/22).

ఇవీ చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌లో దీప్తి శర్మ!

టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Updated Date - Dec 24 , 2025 | 06:24 AM