U19 Asia Cup 2025 Final: రేపు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:37 PM
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్‌ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా రేపు(ఆదివారం) జరిగే ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (IND vs PAK) భారత్ తలపడనుంది.వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్ ఈ తుది పోరుకు సిద్ధమైంది. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని ఈ యువ టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్‌ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో ఫైనల్ మరోసారి దాయాదికి తుది పోరుకు భారత్ సిద్ధమైంది. అలానే పాక్ కు షాకిచ్చి రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ను పట్టేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్.. రెండు మ్యాచ్‌ల్లో 400కుపైగా స్కోర్లు చేసింది. దీన్ని బట్టి యువ భారత జట్టు బ్యాటర్ల విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యంగ్ ప్లేయర్లు వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు సూపర్‌ఫామ్‌లో ఉన్నారు. యూఏఈపై వైభవ్ 95 బంతుల్లోనే 171 పరుగులు చేయగా, మలేసియాపై అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ (209) బాదాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జి నిలకడగా రాణిస్తున్నాడు. ఫినిషింగ్ లో కాన్షిక్ చౌహాన్ అదరగొడుతున్నాడు. లీగ్ స్టేజ్‌లో పాక్‌పై 25 బంతుల్లో 38 పరుగులు చేసిన కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre captain) నుంచి భారత్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక యంగ్ ఇండియా బౌలింగ్ విషయానికొస్తే.. పేసర్ దేపేశ్ దేవేంద్రన్ కీలకం కానున్నాడు. ఈ కుర్రాడు అదిరిపోయే బంతులు సంధిస్తూ ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. ఇతను మలేసియాతో మ్యాచ్‌లో 22 పరుగులకే 5 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఇతడికి తోడు దీపేశ్ కూడా విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు.
మరోవైపు దాయాది దేశం పాక్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజ్‌లో టీమిండియాపై మాత్రమే ఓడి.. మిగిలిన జట్లపై సునాయసంగా పాక్ నెగ్గింది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌ను 121కే ఆలౌట్ చేసి 16.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్‌పై భారత బౌలర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది. అతడు టోర్నీలో 299 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. సమీర్ ను త్వరగా పెవిలియన్ చేస్తే.. భారత్ కు మంచి ఆరంభం లభించినట్లే. పాక్ పేసర్ అబ్దుల్ సుభాన్ బంతితో అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశాడు. ఇతడిని భారత్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్