Share News

Tom Latham record: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:04 PM

న్యూజిలాండ్‌ స్టార్లు ప్లేయర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వేలు 95 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించారు.

Tom Latham record: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు
Tom Latham record

న్యూజిలాండ్‌ స్టార్ ప్లేయర్లు టామ్‌ లాథమ్‌(Tom Latham), డెవాన్‌ కాన్వే(Dewon Conway)లు 95 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో విండీస్‌(New Zealand vs West Indies Test)తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య ఇవాళ(గురువారం) ఓవల్‌ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది.


ఈ మ్యాచ్‌(NZ vs WI Test)లో టాస్‌ గెలిచిన ఆతిథ్య కివీస్‌ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(Tom Latham), డెవాన్‌ కాన్వే సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ లాథమ్‌ 246 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. లాథమ్ 86.4 ఓవర్లో 323 పరుగుల వద్ద రోచ్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ చేజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాన్వే జోరు చూస్తే.. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉంది. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మన్‌ జేకబ్‌ డఫీ(Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 90 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 334 పరుగులు సాధించింది.


95 ఏళ్ల రికార్డ్ బ్రేక్

తొలి వికెట్‌కు లాథమ్‌, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. 2019లో సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించారు. తాజాగా లాథమ్‌-కాన్వే ఆ రికార్డును సవరించారు. అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం సాధించిన జోడీగానూ లాథమ్‌, కాన్వే(Latham Conway partnership) చరిత్రకెక్కారు.


గతంలో ఈ రికార్డ్ ఛార్లెస్‌ స్టెవర్ట్‌ డెంప్‌స్టర్‌, జాన్‌ ఎర్నెస్ట్‌ మిల్స్‌ పేరిట ఉండేది. 1930లో వీరిద్దరు కలిసి ఇంగ్లాండ్‌పై 276 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. 95 ఏళ్ల(95 year record broken) తర్వాత తాజాగా ఆ రికార్డును కూడా లాథమ్, కాన్వే జోడి బ్రేక్ చేసింది. అలానే న్యూజిలాండ్ టెస్ట్ చరిత్రలో 323 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమనేది రెండో అత్యధికం. 1972లో జార్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై 387 పరుగులు భాగస్వామ్యంతో గ్లెన్ టర్నర్, టెర్రీ జార్విస్ మాత్రమే ఈ జాబితాలో లాథమ్, కాన్వే జోడి కంటే ముందున్నారు.


ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Updated Date - Dec 18 , 2025 | 07:15 PM