Rohit Sharma: రోహిత్‌కే ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:59 PM
భారత డ్రెస్సింగ్ రూమ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా వచ్చాయి.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి అభిమానులకు సంతోషం కలిగించే విషయమే. రోహిత్ శర్మ తొలి వన్డేలో నిరాశపరిచినా.. తర్వాత హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినా.. మూడో వన్డేలో అర్థ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత డ్రెస్సింగ్ రూమ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మనే ఈ అవార్డు వరించింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా వచ్చాయి.
ఈ సందర్భంగా రోహిత్‌పై గంభీర్(Gautam Gambhir) ప్రశంసల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ(BCCI) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘శుభ్‌మన్ గిల్(Gill)తో కలిసి తొలి వికెట్‌కు రోహిత్ నిర్మించిన భాగస్వామ్యం అత్యంత కీలకమైంది. ఆ తర్వాత విరాట్-రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. రోహిత్ సెంచరీతో మెరిశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ముగించడం పెద్ద విషయం. ఛేజింగ్‌లో మనమెంత దూకుడుగా ఉంటామో మరోసారి చూపించాం. ఇక ఈ మ్యాచ్‌లో మన బౌలింగ్ కూడా బాగుంది. ఆసీస్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. కానీ సరైన సమయంలో విజృంభించిన మన బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. హర్షిత్ రాణా(Harshit Rana)ను ప్రత్యేకంగా అభినందించాలి. మంచి స్పెల్ వేసి బ్యాటర్లు చుక్కలు చూపించాడు. మున్ముందు ఇలాగే కొనసాగాలని సూచిస్తున్నా. నిరంతరం శ్రమిస్తూ న్యాణ్యమైన బౌలింగ్ వేయాలని మాత్రమే చెప్పగలను’ అని గంభీర్ తెలిపాడు.
ఇదే తొలిసారి: రోహిత్ శర్మ
అవార్డును కండీషనింగ్ కోచ్ ఆడ్రియన్ లె రౌక్స్ చేతుల మీదుగా రోహిత్ శర్మ అందుకున్నాడు.‘ నా కెరీర్‌లో ఓ సిరీస్ కోసం ఎప్పుడూ కూడా నాలుగైదు నెలలు ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశా. దీనిని సరిగ్గా వినియోగించుకోవాలని భావించా. నా శైలిలోనే ఆడాలని నిర్ణయించుకున్నా. మిగిలిన కెరీర్‌లో జట్టు కోసం ఏం చేయగలనో ఆలోచించా. అలా చేయాలంటే ముందు నేను బాగా సన్నద్ధం కావాలి. దానికోసం సమయం తీసుకున్నా. ఆ ఫలితం ఇప్పుడీ సిరీస్‌లో కనిపించింది. ఆస్ట్రేలియాలో ఆడటం నాకెంతో ఇష్టం. విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. గిల్ ఔటయ్యాడు. శ్రేయస్ గాయపడ్డాడు. అతడు బ్యాటింగ్ చేసే అవకాశాలు లేవని స్పష్టం అయింది. దీంతో విరాట్, నేను వికెట్ ఇవ్వకుండా ముగించాలని భావించాం. ఆస్ట్రేలియా ప్రజల అభిమానం అద్భుతం. మా ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో మైదానాలకు వచ్చారు’ అని బీసీసీఐ వెబ్‌సైట్‌తో రోహిత్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి