IND VS SA T20: ముగిసిన భారత్ బ్యాటింగ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Dec 09 , 2025 | 08:45 PM
కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 175 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కటక్‌లోని బారబతి వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(59) అర్ధ సెంచరీతో రాణించాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసి.. భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే సిపంమ్లా రెండు, ఫెరియెరా ఒక వికెట్‌ను పడగొట్టారు.
ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(4), అభిషేక్ శర్మ(17) స్వల్ప పరుగులకే ఔటయ్యారు. భారత్ 5 పరుగుల వద్ద గిల్ వికెట్ ను కోల్పోయింది. ఒక బౌండరీ కొట్టిన గిల్.. ఎంగిడి బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలానే కెప్టెన్ సూర్య కుమార్ కూడా కేవలం 11 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 17 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మరోవైపు ఆచితూచి ఆడుతున్న అభిషేక్ శర్మ.. తిలక్ వర్మతో కలిసి 23 బంతుల్లో 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
స్లోగా అయినా భారత్ స్కోర్ కదలుతుందని భావించి తరుణంలో 48 పరుగుల వద్ద అభిషేక్ శర్మ(17) సిపంమ్లా బౌలింగ్ లో ఔటయ్యాడు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ కాసేపు వికెట్లు పడకుండా ఆపారు. సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం నెమ్మదించింది. 78 పరుగుల వద్ద తిలక్ వర్మ కూడా ఔటయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా(59*) అర్ధ శతకంతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. పాండ్యా మాత్రం మరోవైపు నుంచి పరుగులు రాబడుతున్నాడు. చివర్లో శివమ్ దూబే(11), జితేశ శర్మ(10) రాణించడంతో టీమిండియా.. ప్రొటీస్ జట్టు ముందు 176 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?