Ind Vs SA T20: అతడి వికెట్ కీలకం: మార్‌క్రమ్
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:43 AM
భారత్-సౌతాఫ్రికా మధ్య నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సఫారీల కెప్టెన్ మార్‌క్రమ్ అభిషేక్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ వికెట్ కీలకంగా మారనుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం నుంచి సౌతాఫ్రికా-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టీ20ల్లోనూ నెగ్గి.. టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి గట్టి బదులివ్వాలన్న కృత నిశ్చయంతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు ఈ సిరీస్‌ను గెలుచుకుని మొత్తంగా భారత పర్యటనలో పైచేయి సాధించిన సంతృప్తిలో స్వదేశానికి వెళ్లాలని సౌతాఫ్రికా చూస్తోంది. వన్డేల్లో వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి వారిద్దరూ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు కాబట్టి ఈ సిరీస్‌లో రో-కో ఆడరు. దీంతో అందరి దృష్టి విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పైనే ఉంది. ఈ విషయంపై సౌతాఫ్రికా జట్టు టీ20 కెప్టెన్ మార్‌క్రమ్(Marcram) మాట్లాడాడు.
‘అభిషేక్ శర్మతో కలిసి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాను. అతడు మ్యాచ్ విన్నర్. బ్యాట్‌తో అదరగొడతాడు. అందుకే అభిషేక్ వికెట్ తీయడం కీలకం. కొత్త బంతిని అందుకునే బౌలర్లకు ఇదే పెద్ద సవాలు. భయం లేకుండా ఆడటం.. తొలి బంతి నుంచే బాదుడు మొదలు పెట్టడం ప్రస్తుత టీ20 బ్యాటర్లలో చూస్తున్నాం. ఒక ఆటగాడు ఆరంభం నుంచి దూకుడుగా ఆడటం వల్ల ఆ జట్టు బలమైన స్థితిలో నిలుస్తుంది. ఇలాంటి ప్లేయర్లే ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌ను నడిపిస్తున్నారు’ అని మార్‌క్రమ్ అన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!