Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:41 PM
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను కెమెరామెన్లు ఫొటో తీయడంపై ఆగ్రహించాడీ ఆల్‌రౌండర్. అసలేం జరిగిందంటే...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ఇటీవల ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికాశర్మతో(Mahieka Sharma) ఓ యాడ్‌లో పాల్గొనేందుకు వెళ్లగా ఈ సంఘటన ఎదురైంది. ఫొటో గ్రాఫర్లు(Photo Graphers) తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇబ్బంది పెట్టారని, హద్దు దాటి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు హార్దిక్. ఒక క్రికెటర్‌గా తనపై ప్రజల దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందన్న అతడు.. కొన్ని హద్దులు దాటకూడదని తనకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చాడు.
హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహికాతో పాటు ఓ రెస్టరెంట్‌లో మెట్లపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వారి రాకను గమనించారు అక్కడి ఫొటో గ్రాఫర్లు. వెంటనే కెమెరాలకు పనిచెప్తూ.. డిఫెరెంట్ యాంగిల్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు హార్దిక్. ఇలా ప్రైవేట్‌గా ఫొటోలు తీయడం ఏమాత్రం సరైన పద్దతి కాదని కెమెరామెన్లపై విరుచుకుపడ్డాడు. మహిళలు అన్నిరకాలా గౌరవానికి అర్హులని చెప్పిన హార్దిక్.. వారికీ హద్దులుంటాయని,ఎల్లప్పుడూ వాటిని దాటకూడదన్నాడు. ఫొటో గ్రాఫర్లంటే తనకు గౌరవమని వారికి సహకరిస్తానన్నాడు. కానీ ఆయా సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరాడు. ప్రతి విషయాన్ని ఫొటోలు తీయాల్సిన అవసరం లేదంటూ.. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడీ ఆల్‌రౌండర్.
ఎవరీ మహికా.?
ఇక, ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇటీవల.. మోడల్, యోగా ట్రైనర్ మహికాతో తన కొత్త సంబంధాన్ని ధృవీకరించాడు(Model and Yoga Trainer Mahieka Sharma). ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొట్టగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో తన 32వ పుట్టిన రోజు సందర్భంగా వాటన్నింటికీ తెరదించాడు. మహికాతో కలిసి బీచ్‌లో సందడి చేయడం, ఆమెతో పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను షేర్ చేయడంతో వీరి మధ్య బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. క్రికెట్, కుమారుడు అగస్త్యతో పాటు తన జీవితంలో మూడు ప్రాధాన్యాలలో మహికా కూడా ఒకరని బహిరంగంగా చెప్పాడు హార్దిక్.
ఇక మహికా విషయానికొస్తే.. అగ్రశ్రేణి డిజైనర్లతో కలిసి పనిచేసి ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పొందారీ 24 ఏళ్ల మోడల్. అయితే.. మహికా ఇటీవల తన చేతికి ఓ ఉంగరం ధరించగా.. హార్దిక్‌తో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. వీటిని తోసిపుచ్చిన ఆమె.. రోజూ మంచి మంచి ఆభరణాలను ధరిస్తుంటాం అని ఫన్నీ కామెంట్ చేసింది.
ఇవీ చదవండి:
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్