Share News

Harsha Bhogle: జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:59 AM

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే పలు కీలక సూచనలు చేశాడు. జట్టుకు తానే సీఈవో అన్నట్లు భావించకూడదని.. కెప్టెన్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు.

Harsha Bhogle: జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. నేటి వరకు జట్టు ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను భారత్ గెలిచినప్పటికీ.. టెస్టుల్లో స్వదేశంలోనే న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ అవ్వడం విమర్శలకు దారి తీసింది. గంభీర్ నిర్ణయాల వల్లే జట్టుకు వరసు ఓటములు తప్పట్లేవని అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గంభీర్ పని తీరుపై ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే(Harsha Bhogle) కీలక సూచనలు చేశాడు.


‘గంభీర్‌(Gautam Gambhir) తనను తాను సీఈవోలా భావించకూడదు. ఆయన కన్సల్టెంట్‌ పాత్రలో ఉండాలి. జట్టును నడిపించేది కెప్టెన్‌. ‘ఈ జట్టంతా నేనే నడుపుతున్నా’ అన్న భావన ఆయనకు రాకూడదు. కోచ్‌ ఉన్నా కూడా జట్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునేది కెప్టెన్‌నే. కెప్టెన్ డగౌట్‌లో ఉండగానే బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు మారుస్తున్నారు? అతి ప్రయోగాలు అనర్ధాలకు దారి తీస్తాయి’ అని భోగ్లే అసహనం వ్యక్తం చేశాడు.


దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌ స్పందించాడు. ‘ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొంతమేర కోచ్‌ల పాత్ర పెరుగుతోంది. ఆటగాళ్లు మ్యాచ్‌కు రెండు రోజుల ముందు మాత్రమే జట్టులో చేరే పరిస్థితులు ఉన్నాయి. కానీ జాతీయ జట్లలో మాత్రం కెప్టెన్‌ అధికారాన్ని కాపాడుకోవాల్సిందే. మైదానంలో నిర్ణయాలు తీసుకునేది అతడే. కెప్టెన్ ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు’ అని అభిప్రాయపడ్డాడు.


ఆ లైన్ దాటొద్దు..

ఇటీవల వన్డేల్లో ఫ్లోటింగ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విధానాన్ని గంభీర్‌ సమర్థించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. ‘ఫ్లోటింగ్‌ లైనప్‌ నాకూ నచ్చుతుంది. కానీ అది చాలా సున్నితమైన విషయం. ఆటగాళ్ల పాత్రలతో అతిగా ప్రయోగాలు చేయకూడదు. టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌, టెయిల్‌ ఎండర్స్‌ అనే మూడు విభాగాల మధ్య సృజనాత్మకత చూపించొచ్చు. కానీ ఆ ‘ఫైన్‌ లైన్‌’ దాటకూడదు’ అని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ

ఐపీఎల్ వేలంలో నయా రూల్.. ఏంటో తెలుసా?

Updated Date - Dec 16 , 2025 | 09:59 AM