Ben Stokes: మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:13 PM
యాషెస్ సిరీస్ మ్యాచ్‌ల మధ్యలో విరామం సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో తూగుతూ కనిపించిన వీడియోలు సంచలనం రేపాయి. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఈ విషయంపై మౌనం వీడారు. ఏది జరిగినా ఆటగాళ్ల వెనక నిలబడతానని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండు, మూడో టెస్టుల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే. డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) తొలిసారి స్పందించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్టోక్స్ కొట్టి పారేశాడు. బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో స్టోక్స్ ఈ విషయంపై మాట్లాడాడు. ‘ఈ సమయంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను అనేదే నాకు అత్యంత కీలకం. ఇంగ్లండ్ కెప్టెన్‌గా జట్టులోని ప్రతి ఒక్కరిని.. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్ల సంక్షేమాన్ని కాపాడటం నా బాధ్యత. ఇలాంటి విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇవి వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే కెప్టెన్‌గా నా ఆటగాళ్లను సాధ్యమైనంత వరకు రక్షించడం నా ప్రధాన కర్తవ్యం’ అని స్టోక్స్ వెల్లడించాడు.
పరోక్షంగా స్పందిస్తూనే..
‘యాషెస్ సిరీస్‌ను ఇంకా రెండు మ్యాచులు ఉండగానే కోల్పోయాం. ఇలాంటి సమయంలో మా జట్టు ఆటగాళ్లను చూసుకోవడం నా బాధ్యత. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. ఈ రకమైన విషయాలు ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడూ నా ఆటగాళ్ల వెనక నిలబడతాను’ అని మద్యం మత్తులో ఉన్న ఆటగాళ్ల విషయంపై పరోక్షంగా స్పందిస్తూనే.. ఆ విషయాన్ని కొట్టిపారేశాడు.
తీవ్ర ఆగ్రహం..
నూసాలో ఆటగాళ్లు తప్పు చేశారా? అన్న ప్రశ్నకు స్టోక్స్ ఆగ్రహంగా స్పందించారు. ‘ఇప్పటికే అన్నీ చెప్పేశాను. నేను ఎప్పటికీ నా ఆటగాళ్లకు మద్దతుగా ఉంటాను. మైదానంలో కెప్టెన్‌గా మ్యాచ్‌లు గెలిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. కానీ ఇలాంటి సందర్భాల్లో మరో బాధ్యత కూడా ఉంటుంది. అవసరమైతే నా ఆటగాళ్లను కాపాడటం నా కర్తవ్యం. ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉండి, దేశం కోసం మిగిలిన మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగల స్థితిలో ఉండేలా చూసుకోడంమే ప్రస్తుతం నా లక్ష్యం’ అంటూ స్టోక్స్ తన వైఖరిని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు