Share News

T20 Women WC 2026: కప్పు గెలవాలంటే.. ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిందే!

ABN , Publish Date - Dec 24 , 2025 | 10:44 AM

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

T20 Women WC 2026: కప్పు గెలవాలంటే.. ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిందే!
T20 Women WC 2026

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ నుంచి తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ వరకు భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తూ వరుసగా విజయాలు సాధిస్తుంది. అయినప్పటికీ ఒకటే వెలితి.. అదే ఫీల్డింగ్‌ లోపాలు. శ్రీలంకతో జరుగుతున్న స్వదేశీ టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లే దీనికి నిదర్శనం. తొలి మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు జారిపోగా, రెండో మ్యాచ్‌లో మరో రెండు అవకాశాలు చేజారాయి. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌కు ఇది హెచ్చరికగానే మారింది.


విశాఖలో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచినా, ఆ విజయం ఫీల్డింగ్ లోపాలను పూర్తిగా కప్పి పుచ్చలేకపోయింది. షెఫాలి వర్మ(69*) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా చేధించింది. అంతకుముందు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను 128/9కే పరిమితం చేశారు. అయితే ఫీల్డింగ్ మరింత చురుకుగా ఉంటే ప్రత్యర్థి స్కోరు ఇంకా తగ్గేదని విశ్లేషకుల అభిప్రాయం.


మ్యాచ్ అనంతరం షెఫాలి జట్టు ప్రదర్శనపై మాట్లాడింది. ‘మేమంతా ఫీల్డింగ్ విషయంలో చాలా కష్టపడుతున్నాం. రోజురోజుకీ మెరుగుదల కనిపిస్తోంది. కానీ ఇది సరిపోదు. ఫీల్డింగ్‌లో మేం ఇంకా మెరుగుపడాలి. వైష్ణవి అరంగేట్ర వికెట్‌కు జట్టు మొత్తం ఉత్సాహంగా స్పందించిన తీరు కూడా ఫీల్డింగ్‌లో పెరుగుతున్న ఎనర్జీకి నిదర్శనం’ అని షెఫాలీ వెల్లడించింది.


ప్రపంచ టీ20కు సిద్ధమవుతున్న భారత్‌కు బ్యాటింగ్ బలం స్పష్టంగా ఉంది, బౌలింగ్ కూడా క్రమంగా గాడిలో పడుతోంది. కానీ పెద్ద టోర్నీల్లో ట్రోఫీని నిర్ణయించేది చిన్న అవకాశాలే. మహిళల జట్టుకు ఆ చివరి మెట్టు.. పదునైన ఫీల్డింగ్‌, క్యాచింగ్‌. అది సాధ్యమైతే ప్రపంచ కప్ కల నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.


ఇవీ చదవండి:

టాస్ ఓడిన ఆంధ్ర.. బ్యాటింగ్ ఎవరంటే?

విజయ్ హజారే ట్రోఫీ.. రో-కో పారితోషికం ఎంతో తెలుసా?

Updated Date - Dec 24 , 2025 | 10:44 AM