Robin Uthappa: సూర్య ఫామ్ వల్లే గిల్‌పై వేటు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:59 AM
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. గిల్‌పై వేటు పడింది. సూర్యను ఎందుకు తప్పించలేదనే వాదన మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే భారత టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు జట్టు ఎంపికపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టీ20 వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం, పూర్తిగా ఫామ్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ హోదాతో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ విజేత రాబిన్ ఉతప్ప(Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘గత 22 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్థానం పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది కాలంలో అతడు కేవలం రెండుసార్లు మాత్రమే 25 పరుగుల మార్క్‌ను దాటాడు. అయినప్పటికీ కెప్టెన్ కావడంతో అతడికి సెలక్టర్లు అతడికి మినహాయింపు ఇచ్చారు. ప్రపంచ కప్ జట్టులో గరిష్ఠంగా ఒకరిని మాత్రమే ఫామ్ లేకున్నా భరించగలం. అంతకంటే ఎక్కువ మందిని తీసుకెళ్లలేం. అదే ఇక్కడ సమస్య. సూర్యకుమార్ పరుగులు చేయకపోవడం వల్లే గిల్‌ను జట్టుకు దూరం చేశారు. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకరిపై వేటు పడటం సహజమే’ అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
ముందే అలా చేయాల్సింది..
‘గిల్(Shubman Gill)ను తప్పించడాన్ని నేనేమీ వ్యతిరేకించడం లేదు. అతడి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎంపిక మాత్రం సెలక్టర్లకు పెద్ద సవాలుతో కూడుకున్న పనే. కానీ సెలక్షన్ ప్రక్రియ తీరుపైనే నా అభ్యంతరం అంతా. ఏదీ చూడకుండా గిల్‌ను ముందే వైస్ కెప్టెన్‌గా ప్రకటించకుండా ఉండాల్సింది. లేదా ఒకసారి ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి’ అని ఉతప్ప వెల్లడించాడు.
ఇవీ చదవండి:
టాస్ ఓడిన ఆంధ్ర.. బ్యాటింగ్ ఎవరంటే?
విజయ్ హజారే ట్రోఫీ.. రో-కో పారితోషికం ఎంతో తెలుసా?