Share News

Rohit Sharma: హిట్‌మ్యాన్ కా హుకుం.. అంతుపట్టని సమస్యకు పిండం పెట్టాడు

ABN , Publish Date - Feb 10 , 2025 | 09:12 AM

IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మీద వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తనదైన స్టైల్‌లో స్టన్నింగ్ నాక్‌తో నిజమైన హిట్‌మ్యాన్ అంటే ఏంటో చూపించాడు.

Rohit Sharma: హిట్‌మ్యాన్ కా హుకుం.. అంతుపట్టని సమస్యకు పిండం పెట్టాడు
India vs England

భారత సారథి రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి పనైపోయింది.. రిటైర్మెంట్ తీసుకోవాలని క్రిటిక్స్ విమర్శించారు. టీ20ల మాదిరిగానే అతడు వన్డేలు, టెస్టులకూ గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చిందని కామెంట్స్ చేశారు. కొత్త తరానికి పగ్గాలు ఇచ్చేసి రెస్ట్ తీసుకోమన్నారు. ఫిట్‌నెస్ లేదు, ఫామ్‌లో లేడంటూ హిట్‌మ్యాన్‌ను నానా మాటలు అన్నారు. కానీ వేటినీ లెక్కచేయని టీమిండియా కెప్టెన్.. తన బ్యాట్‌తోనే అన్ని ప్రశ్నలు, విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో బారామతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 76 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని హిట్టింగ్ అంటే తన తర్వాతే ఎవరైనా అని మరోమారు నిరూపించాడు.


నోళ్లు మూయించాడు!

రెండో వన్డేలో 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇందులో 12 బౌండరీలు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా.. ఒకట్రెండు బడా షాట్లు కొట్టాక అతడు రిథమ్ అందుకున్నాడు. క్రీజులో సెటిల్ అయ్యాక ఉతుకుడు మొదలుపెట్టాడు. వుడ్, రషీద్, అట్కిన్సన్, మహ్మూద్, ఓవర్టన్.. ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా బాదేశాడు. అతడి నాక్ వల్ల 304 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 33 బంతులు ఉండగానే భారత్ ఛేజ్ చేసేసింది. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్.. చాన్నాళ్లుగా వేధిస్తున్న ఓ సమస్యకూ పిండం పెట్టేశాడని చెప్పొచ్చు. అది మరేదో కాదు.. షార్ట్ బాల్ వీక్‌నెస్.


బలం కూడగట్టుకున్నాడు!

షార్ట్ లెంగ్త్ డెలివరీస్‌ను పుల్ షాట్ ద్వారా బౌండరీలు, సిక్సులుగా మలచడం రోహిత్‌ ప్రత్యేకత. అతడి పుల్ షాట్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ షాట్‌తో ఎన్నో పరుగులు రాబట్టిన హిట్‌మ్యాన్.. ఈ మధ్య అదే బాల్‌ను సరిగ్గా జడ్జ్ చేయలేక, టైమింగ్ కుదరక ఔట్ అవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఈ బంతితో అతడ్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఔట్ చేశాయి. రంజీ ట్రోఫీలోనూ ఈ రకమైన బంతులకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు. అయితే ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో మాత్రం ఈ బంతులకు భారీ ఫోర్లు, సిక్సులు బాదాడు. వుడ్ 150 కిలోమీటర్ల వేగంతో వేసిన షార్ట్ పిచ్ డెలివరీస్‌ను భారీ సిక్సులుగా మలిచాడు. బలంగా ఉన్న షాట్ బలహీనతగా మారి ఇన్నాళ్లూ అంతుపట్టని సమస్యగా అతడ్ని వేధించింది. ఇప్పుడు దానికి తనదైన స్టైల్‌లో పిండం పెట్టేశాడు హిట్‌మ్యాన్.


ఇవీ చదవండి:

జ్యోతి హ్యాట్రిక్‌ పసిడి

‘రెండు’కు ఆస్ట్రేలియా

సింధుకు గాయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2025 | 09:17 AM