ECL T10 2025: కొడితే సిక్స్ లేదంటే ఫోర్.. ఇదేం లీగ్ రా నాయనా..
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:58 PM
ECL 2025 Season 2 Streaming: కొడితే సిక్స్ లేదంటే ఫోర్.. 22 బంతుల్లో సెంచరీ, 34 బంతుల్లో 150 నాటౌట్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ చూడని స్కోర్లు ఇవి. కానీ ఓ లీగ్‌లో మాత్రం నీళ్లు తాగినంత అలవోకగా భారీ స్కోర్లు బాదేస్తున్నారు. ఆ లీగ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

కొడితే బంతి స్టాండ్స్‌లో పడాల్సిందే. ఇంకాస్త బలం బాది మోదితే స్టేడియం దాటాల్సిందే. కాస్త మిస్ టైమింగ్ అయినా బౌండరీ గ్యారెంటీ. చెత్త షాట్ కొట్టినా పరుగులే పరుగులు. మరీ అధ్వాన్నమైన షాట్ కొడితే తప్ప ఔట్ అయ్యే ప్రసక్తే లేదు. నీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు, సిక్సుల వర్షం.. 22 బంతుల్లోనే సెంచరీ, 34 బంతుల్లో 150 పరుగులు. కలలోనూ ఊహించని ఈ స్కోర్లు ఒక టీ10 లీగ్‌లో నమోదవుతున్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచుల రేంజ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌లు.. రికార్డు స్థాయిలో వ్యూస్. ఇంత ఉపోద్ఘాతం చెప్పేది ఎంటర్‌టైన్‌మెంట్ క్రికెట్ లీగ్ గురించే. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా.. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
పదేసి ఓవర్లు..
ప్రొఫెషనల్ క్రికెటర్లు ఆడే లీగ్స్, సిరీస్‌లను క్రికెట్ లవర్స్ అంతా ఫాలో అవుతుంటారు. వీటితో పాటు సెలెబ్రిటీలు ముఖ్యంగా ఫిల్మ్, టెలివిజన్ స్టార్స్ ఆడే టోర్నమెంట్‌లకు కూడా మంచి రేంజ్‌లో ఆదరణ దక్కుతూ ఉంటుంది. అయితే వీటన్నింటికీ అతీతంగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ఓ లీగ్ ఏర్పడింది. దాని పేరే ఎంటర్‌టైన్‌మెంట్ క్రికెట్ లీగ్. టీ10 ఫార్మాట్‌లో రెండు జట్లు పదేసి ఓవర్ల చొప్పున ఆడే లీగ్ ఇది. టెన్నిస్ బాల్‌తో మ్యాచులు నిర్వహిస్తుంటారు.
8 టీమ్స్..
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన ఆటగాళ్లతో కలిపి ఈసీఎల్ టీ10లో 8 టీమ్స్ ఏర్పాటు చేశారు. అవే.. డైనమిక్ ఢిల్లీ, హరియాణ్వీ హంటర్స్, బెంగళూరు బాషర్స్, రాజస్థాన్ రేంజర్స్, లక్నో లయన్స్, కోల్‌కతా సూపర్‌స్టార్స్, ముంబై డిస్‌రప్టర్స్, చెన్నై స్మాషర్స్. ఎల్విష్ యాదవ్, గౌరవ్ తనేజా, మునావర్ ఫరూకీ లాంటి పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆయా టీమ్స్‌కు కెప్టెన్స్‌గా ఎంపిక చేశారు.
స్ప్రింగులు వాడుతున్నారా..
టెన్నిస్ బాల్ టోర్నమెంట్ కావడంతో బ్యాటర్లు ప్యాడ్లు, హెల్మెట్, గ్లౌవ్స్ లేకుండానే బరిలోకి దిగుతున్నారు. బ్యాట్లలో స్ప్రింగులు పెడుతున్నారేమో ఏమో గానీ బంతి తగిలితే స్టేడియంలో పడుతోంది. అలాగని బౌలర్లు నార్మల్‌గా బంతులేస్తున్నారని భావిస్తే పొరపాటే. వేగంగా, తెలివిగా బంతులు వేస్తున్నా బ్యాట్ల మహిమ వల్లే ఫోర్లు, సిక్సుల వాన కురుస్తోంది. ప్రొఫెషనల్ క్రికెటర్స్, సినీ స్టార్లు లేకపోయినా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆడే టోర్నీని సోనీ స్పోర్ట్స్ 5 లాంటి చానల్ టెలికాస్ట్ చేయడం హైలైట్ అనే చెప్పాలి. సీజన్-2తో వ్యూస్‌లో మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే..
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి