Amit Pasi's explosive: బరోడా ప్లేయర్ విధ్వంసం.. ప్రపంచ రికార్డును సమం
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:08 PM
సయ్యద్ ముస్తాక్ అలీ 2025 టీ20 టోర్నీలో బరోడా ప్లేయర్ అమిత్ పాసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. 55 బంతుల్లో 114 పరుగులు చేసి.. అరంగ్రేట మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) 2025లో తమ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో బరోడా వికెట్ కీపర్-బ్యాటర్ అమిత్ పాసి(Amit Pasi) 55 బంతుల్లో114 పరుగులతో టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించి.. ఓ ప్రపంచ రికార్డు(world record,)ను సమం చేశాడు. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని జింఖానా మైదానం వేదికగా ఇవాళ (సోమవారం) బరోడా, సర్వీసెస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా బరోడా వికెట్ కీపర్ బ్యాటర్ అమిత్ పాసి.. సెంచరీతో (114) సత్తా చాటాడు. దీంతో సియాల్‌కోట్ స్టాలియన్స్ జట్టు తరఫున మే 2015లో తన తొలి మ్యాచ్‌లోనే 48 బంతుల్లో 114 పరుగులు చేసిన పాకిస్థాన్ క్రికెటర్ బిలాల్ ఆసిఫ్‌తో సమానంగా నిలిచాడు.
అలాగే మరో ఘనతను అమిత్ పాసి(Amit Pasi) తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్(T20 debut century)లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా అమిత్ పాసి రికార్డు సృష్టించాడు. అతనికి కన్నా ముందు 2019లో పంజాబ్ తరఫున శివమ్ భాంబ్రి హిమాచల్ ప్రదేశ్‌పై 106 పరుగులు చేశాడు. అలాగే 2010లో హైదరాబాద్ తరఫున అక్షత్ రెడ్డి, ముంబైపై 105 పరుగులు చేశాడు. అయితే ఈ మూడు సెంచరీలు కూడా సయ్యద్ ముస్తాక్ అలీ(Syed Mushtaq Ali Trophy) ట్రోఫీలోనే రావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అమిత్ పాసి 24 బంతుల్లోనే అర్ధసెంచరీ, 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరికి 55 బంతుల్లో 114 పరుగులు చేసి.. అభిషేక్ తివారి బౌలింగ్ లో రవి చౌహాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్ లో బరోడా జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. బరోడా జట్టు విజయం సాధించడంలో పాసి కీలక పాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్(Baroda vs Services) విషయానికి వస్తే.. టాస్ గెలిచిన బరోడా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. బరోడా బ్యాటర్లలో అమిత్ పాసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సొలంకి (25), భాను పనియా (28*) కాస్తా ఫర్వా లేదనిపించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. రావత్ 14, రత్వ్ 12, శివాలిక్ శర్మ 16, ధృవ్ పటేల్ 5 పరుగులు చేశారు. ఇక సర్వీసెస్ బౌలర్లలో అభిషేక్ తివారీ మూడు వికెట్లు తీయగా.. మోహిత్ రాథే, రవి చౌహాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. కున్వర్ పాథక్ (51), రవి చౌహాన్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. మోహిత్ అహ్లవత్ (41), నకుల్ శర్మ (24) ఫర్వాలేదనిపించారు. బరోడా బౌలర్లలో రాజ్ లింబనీ 3, సఫ్వాన్ పటేల్ 2, మహేష్ పితియా, చింతల్ గాంధీ తలో వికెట్ తీసుకున్నారు. బరోడా విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ పాసి(Amit Pasi)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
India T20 Squad: స్టార్ ప్లేయర్‌పై వేటు... టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే?
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!