Reduce Home Loan EMI: మీ హోమ్‌లోన్ ఈఎంఐ భారాన్ని స్మార్ట్‌గా తగ్గించుకోండిలా..
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:42 PM
మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా? నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానాన్ని ఎంచుకుంటున్నారా? అయితే.. ఒక్కసారి ఈ ప్లాన్‌ను పరిశీలించండి. భారీ వడ్డన నుంచి ఉపశమనం పొందే ఆ ప్లాన్ వివరాలు మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: మీ హోమ్‌లోన్ చెల్లింపులను నెలకు ఒకసారి ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నారా? ఆ రకంగా కాకుండా.. స్మార్ట్ ప్లానింగ్‌తో పే చేయడం ద్వారా భారీ సొమ్ము ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ స్మార్ట్ ప్లానింగ్ ఏంటి? ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకోండి..
చాలా మంది కస్టమర్లు 20-30 ఏళ్ల కాలపరిమితితో హోమ్ లోన్ తీసుకుని నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ అదే మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించుకుని 15 రోజులకు ఒకసారి చెల్లించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నెలకు ఒకసారి చెల్లించే ఈఎంఐ ద్వారా ఏడాదికి 12 సార్లు పే చేయాల్సి ఉంటుంది. కానీ, రెండు వారాలకు ఒకసారి చెల్లించడం ద్వారా ఏడాదికి 26 చెల్లింపులు అవుతాయి. దీని ప్రకారం ఏడాదికి 13 ఈఎంఐలు పూర్తైనట్టు అని వారు వివరిస్తున్నారు. అదనంగా చెల్లించే 13వ ఈఎంఐ నేరుగా అసలు చెల్లింపునకు వెళుతుందని.. ఫలితంగా లోన్ బ్యాలెన్స్‌ను వేగంగా తగ్గించుకోవచ్చని, దీనివల్ల పెద్దఎత్తున వడ్డీ భారం తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు హోమ్ లోన్ పొందిన ఖాతాదారుల కాలపరిమితిని సుమారు 6 - 7 సంవత్సరాల పాటు తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా మొత్తమ్మీద రూ.12 లక్షల నుంచి 18 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చని ఉదహరిస్తున్నారు. ఈ పద్ధతిని అనుసరించేందుకు లోన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ చేయనవసరం లేదంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ హోమ్ లోన్‌లలో భిన్న రకాల పాలసీలు అందుబాటులో ఉన్నందున.. లోన్ తీసుకునే ముందు ఆయా బ్యాంకులలో ఇలా రెండు వారాలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానం అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. మరి ఇకపై మీరు లోన్ పొందాలనుకుంటే ఎంచెక్కా ఈ స్మార్ట్ ప్లానింగ్ ఫాలో అయిపోండి. అధిక వడ్డన నుంచి ఉపశమనం పొందండి.
ఇవీ చదవండి: