Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:41 AM
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది.
గత కొద్దిరోజుల నుంచి దేశ విమాన ప్రయాణీకులను ఇండిగో సంక్షోభం కలవరపెడుతోంది. నిత్యం వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు అన్ని విమాన సంస్థలు టికెట్ ధరల్ని భారీగా పెంచేస్తున్నాయి. టికెట్ ధరలు ప్రయాణీకుల పాలిట శాపంగా మారిపోయాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఏకంగా 40 వేల రూపాలయు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సరైన దిశలోనే చర్యలు చేపడుతోందని తెలిపింది. ప్రస్తుతం తాము ఎలాంటి చర్యలు తీసుకోదలచుకోలేదని స్పష్టం చేసింది. ఇండిగో సంక్షోభం తీవ్రమైన సమస్యే కానీ కేంద్రం చర్యలు సరైన దిశలోనే ఉన్నాయని అంది.
ఆదివారం ఒక్కరోజే 650 సర్వీసులు
నిన్న (ఆదివారం) ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 650 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో శంషాబాద్ నుంచి 115 సర్వీసులు, బెంగళూరు నుంచి 150, ఢిల్లీ నుంచి 108 సర్వీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండిగో ఓ కీలక ప్రకటన చేసింది. బుధవారం నాటికి దాదాపు అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించిన రీఫండ్‌ను ఎప్పటికప్పుడు సంస్థ చెల్లిస్తోంది. ఆదివారం ఉదయానికల్లా 610 కోట్ల రూపాయలు రీఫండ్ చేసినట్లు ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.