Share News

Geoffrey Hinton on CS: కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు.. విద్యార్థులకు ఏఐ గాడ్ ఫాదర్ కీలక సూచన

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:26 PM

విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అప్పుడే నిర్లక్ష్యం చేయొద్దని ప్రముఖ శాస్త్రవేత్త, ఏఐ గాడ్ ఫాదర్ జాఫ్రీ హింటన్ సూచించారు. ఈ డిగ్రీల్లో నేర్చుకునే అంశాలు ఆధునిక సాంకేతికతకు మూలమని వివరించారు.

Geoffrey Hinton on CS: కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు.. విద్యార్థులకు ఏఐ గాడ్ ఫాదర్ కీలక సూచన
Geoffrey Hinton on Future of CS degrees

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఏఐ‌తో కోడింగ్ ఎంతో సులువైపోయింది. మధ్యస్థాయి ప్రోగ్రామర్‌కు ఉండే నైపుణ్యాలు ఏఐలో కనిపిస్తున్నాయి. దీంతో, కంప్యూటర్ సైన్స్ (సీఎస్) డిగ్రీలకు ఇక విలువ ఉండదన్న భావన విద్యార్థుల్లో బలపడుతోంది. ఈ అంశంపై ప్రముఖ కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త, ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరుపొందిన జాఫ్రీ హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎస్ డిగ్రీలపై నిర్లక్ష్యం వద్దని విద్యార్థులను హెచ్చరించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన కంప్యూటర్ సైన్స్ చదువుల భవితవ్యంపై పలు విషయాలను పంచుకున్నారు(Geoffrey Hinton on Future of CS Degrees).

‘సీఎస్ అంటే కేవలం ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం అని చాలా మంది అనుకుంటారు. వాస్తవానికి మధ్యస్థాయి ప్రోగ్రామర్‌లు కూడా ప్రస్తుతం తమ కెరీర్‌లో ఆశించిన స్థాయికి చేరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. వారు చేసే పనులను ఏఐ చక్కబెట్టగలదు. అయితే, సీఎస్ డిగ్రీలకున్న విలువ మాత్రం యాథాతథంగా చాలా ఏళ్లపాటు కొనసాగుతుంది’ అని ఆయన తేల్చి చెప్పారు (Artificial Intelligence).


సీఎస్ డిగ్రీ చదువుల్లో కేవలం ప్రోగ్రామింగ్‌‌ను నేర్చుకోవడమే ఉంటుందని అనుకోవడం తప్పని ఆయన చెప్పారు. సీఎస్ డిగ్రీ విద్యార్థులు నేర్చుకునే సిస్టమ్స్ థింకింగ్, గణితం, లాజిక్, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే నైపుణ్యాలు ఆధునిక సాంకేతికతకు మూలమని వివరించారు. ‘ కాబట్టి, కోడింగ్ నేర్చుకోవడం ఇప్పటికీ ఉపయోగకరమే. ఒకరంగా ఇది లాటిన్ భాషను నేర్చుకోవడం లాంటిది. ఆ భాషను మళ్లీ ఎప్పుడూ మాట్లాడకపోయినా ఉపయోగాలు మాత్రం ఉన్నాయి’ అని అన్నారు. బేసిక్ ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు తగ్గిపోయినా సీఎస్‌ డిగ్రీల విలువ మాత్రం అంత త్వరగా తగ్గదని చెప్పారు.

రాబోయే తరాల ఏఐ పరిశోధకులు, ఇంజనీర్‌లు గణితం, ప్రోబబిలిటీ, గణాంక శాస్త్రం, లీనియర్ ఆల్జీబ్రా వంటి సబ్జెక్టులపై పట్టు సాధించాలని జాఫ్రీ హింటన్ సూచించారు. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా ఈ నైపుణ్యాలకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఇక జెమినై-3 ఆవిష్కరణ తరువాత గూగుల్ ఏఐ రేసులో పుంజుకుందని జాఫ్రీ అభిప్రాయపడ్డారు. అయితే, మళ్లీ దూకుడు పెంచడానికి గూగుల్‌కు ఇంత సమయం పట్టడం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉందని అన్నారు.


ఇవీ చదవండి:

విదేశాల్లో 18 లక్షల పైచిలుకు మంది భారతీయ విద్యార్థులు.. విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడి

జేఈఈ మెయిన్‌ ఫిజిక్స్‌ ప్రిపరేషన్‌కాన్సెప్ట్‌ తెలిస్తే కష్టం కాదు

మరిన్ని విద్యా సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 08 , 2025 | 03:43 PM